Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామానికి ఆమడ దూరంలో నిర్మాణాలు
- వేదికల్లో మౌలిక వసతులు కరువు
- చర్చలు, సమావేశాలకు అనుకూలంగా లేని భవనాలు
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
వంగూరు మండలంలో 27 గ్రామ పంచాయతీలకు సంబంధించి 9 క్లస్టర్లుగా విభజించి రైతు వేదికలను నిర్మించారు. వంగూరు, ఉమ్మాపూర్, సర్వరెడ్డిపల్లి తండా, తిప్పారెడ్డిపల్లి, పోల్కంపల్లి, రంగాపూర్, కొండారెడ్డిపల్లి, జాజాల, డిండి చింతపల్లి గ్రామాల్లో దాదాపు రూ.2కోట్లతో ఈ వేదికలు నిర్మించారు. కానీ వాటిని నేటికీ ప్రారంభించకపోవడంతో పడువబడిపోతున్నాయి. గతంలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన వ్యాపారులు.. దాన్ని నిల్వ ఉంచేందుకు ఈ రైతు వేదికలను ఉపయోగించుకున్నారు.
రైతన్నలకు వ్యవసాయాధికారుల ద్వారా మెళకువలతో పాటు సూచనలు, సలహాలిచ్చి మంచి దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో నిర్మించిన చాలా రైతు వేదికలు ప్రారంభానికే నోచుకోవడం లేదు. కొన్ని ప్రారంభించినా గ్రామాలకు దూరంగా ఉండగటంతో నిరుపయోగంగా మారాయి. విత్తనాలు, ఎరువులు, పనిముట్ల నిల్వ కోసం, రైతులు సమావేశం అయ్యేందుకు ఒక్కో వేదిక నిర్మాణానికి రూ.22 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. వాటి వద్ద ఎలాంటి మౌలిక వసతులూ కల్పించలేదు. కొన్ని రైతు వేదికలు పూర్తైనా ప్రారంభానికి నోచుకోవడం లేదు. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. రైతులకు, సమావేశాలకు అనుకూలంగా లేని భవనాల్లో చర్చలెలా సాగుతాయని స్థానికులంటున్నారు. అంతేగాకుండా, చాలా గ్రామాల్లో పాలకులు, అధికారులు పెద్దల భూములను వదిలేసి.. చాలా వరకు గైరాన్, పేదల భూములను లక్ష్యంగా స్వాధీనం చేసుకుని రైతు వేదికలను నిర్మించడం గమనార్హం.
ఉమ్మడి మహబూబనగర్ జిల్లాలో రూ.19.38 కోట్లతో 88 రైతు వేదికలను మంజూరు చేసి అన్నిటినీ నిర్మించారు. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. రూ.14.28 కోట్ల బిల్లులను చెల్లించారు. ఇంకా రూ.5కోట్ల దాకా బిల్లులు రావాల్సి ఉంది. నారాయణపేట జిల్లాలో 77 రైతు వేదికలకు రూ.16.94 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు రూ.14.26 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.5.10 బిల్లులు చెల్లించాల్సి ఉంది. వనపర్తి జిల్లాలో 71 రైతు వేదికలకు మొత్తం పూర్తి చేశారు. అందులో రూ.16.94 కోట్లకు రూ.11 కోట్లు మాత్రమే విడుదల చేశారు. గద్వాల జిల్లాలో 97 రైతు వేదికలకు 82 పూర్తి చేశారు. రూ.21.34 కోట్లకు గానూ రూ.11.50కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.9.84 కోట్లు రావ్వాల్సి ఉంది. నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం 143 రైతు వేదికలను నిర్మించారు. ఇప్పటివరకు 79 వేదికలను పూర్తి చేశారు. రూ.17.34 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ.12.20 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.5.18 కోట్లు ఖర్చు చెల్లించాల్సి ఉంది.
నెరవేరని లక్ష్యం !
ఇప్పటి వరకు 80 శాతం రైతు వేదికలు పూర్తైనా ఉపయోగంలోకి రాలేదు. అనేక చోట్ల గ్రామానికి దూరంగా, అసౌకర్యాలకు నిలయంగా ఉన్నాయి. గ్రామ నడిబొడ్డున ఉన్న పంచాయతీ సమావేశాలకే వార్డు మెంబర్లు రావడం లేదు. ఇక గ్రామానికి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో రైతు వేదికలను నిర్మిస్తే ప్రయోజనం లేదని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఐదు వేల ఎకరాలకు ఒక రైతు వేదికను నిర్మించడంతో ఐదారు గ్రామాలకు అసౌకర్యంగా ఉంటుంది. తాడూరు గ్రామంలో రైతు వేదిక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలకపల్లిలో రైతు వేదిక గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊర్కొండ మండల కేంద్రంలో ఓ దళితునికి చెందిన ఎడ్ల దొడ్డిని ధ్వంసం చేసి రైతు వేదిక నిర్మించారన్న ఆరోపణలున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి క్లస్టర్కూ ఒకటి చొప్పున 316 రైతు వేదికలు నిర్మాణమయ్యాయి. చాలా వరకు ఉపయోగంలో లేవు. పట్టించుకునేవారే కరువయ్యారని రైతులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో 84 రైతు వేదికలున్నాయి. ప్రస్తుతం చాలా వరకు నిర్మానుష్యంగానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గోదాములుగా మార్చుతున్నారు. తాళాలు తీసేవారే లేరని రైతు సంఘాల నేతలు విమర్శించారు. మైకులు, కుర్చీలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కూడా లేవు. చాలా వాటికి తలుపులు లేకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారాయి. సమస్యలున్న మాట వాస్తవేమనని, కానీ వారంలో రెండుసార్లు వ్యవసాయ విస్తరణాధికారులు రైతు వేదికల వద్దకు వెళ్లి రైతులకు సూచనలు అందిస్తున్నారని జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
నాలుగు కిలోమీటర్లు వెళ్లాలి
సర్పంచ్ జి.ఈశ్వరయ్య- నడిగడ్డ గ్రామం- తెలకపల్లి మండలం
మాకు రైతువేదిక అనేది లేదు. నాలుగు కిలోమీటర్ల దూరంలో గౌరారం దగ్గర నిర్మించారు. మాకు అక్కడికి వెళ్లి మా సమస్యలు చెప్పడానికి వీలు కాదు. అక్కడికి వెళ్లినా.. అధికారులు ఉంటారో ? ఉండరో తెలియని పరిస్థి. అందువల్ల వీటివల్ల మాకు ఎలాంటి ఉపయోమూ లేదు.