Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ స్థలాన్ని ఇతర రంగాలకు కేటాయించొద్దు
- సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంచిర్యాల జిల్లా మందమర్రిలో లెదర్ పార్క్‌ను పున:ప్రారంభించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ స్థలాన్ని ఇతర రంగాలకు కేటాయించొద్దని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలో 2009లో లెదర్ పార్క్‌ను ప్రారంభించారని గుర్తు చేశారు. సర్వే నెంబరు 148లో 24 ఎకరాల భూమిని లిడ్కాప్ చర్మకారుల వృత్తి శిక్షణా కేంద్రానికి, అందులో ఒక ఎకరాను ఉత్పత్తి కోసం కేటాయించారని వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో షెడ్లు నిర్మించి 300 మంది ఎస్సీ యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉత్పత్తినీ ప్రారంభించారని తెలిపారు. ఆ తర్వాత కాలంలో ప్రభుత్వం నుంచి నిధులు రాక ఆగిపోయిందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు తమరికి మెమోరాండాన్ని సమర్పించామని తెలిపారు. స్ధానిక అధికారులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులకు విన్నవించుకున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తక్షణమే ఈ సంస్థకు నిధులు కేటాయించి తిరిగి ప్రారంభిస్తామంటూ సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు.ఈ హామీ నెరవేరక ముందే స్థానిక మందమర్రి మున్సిపాలిటీ అధికారులు ఈ లెదర్ పార్క్‌కు ఇచ్చిన భూమిలో రెండెకరాల స్థలాన్ని పట్టణ క్రీడా ప్రాంగణం కోసం, మహిళా భవనం కోసం కేటాయించి నిర్మాణాలు చేపట్టారని వివరించారు. ఈ స్థలాన్ని తిరిగి లెదర్ పార్క్కే అప్పగించి, నిర్మాణాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. లెదర్ పార్క్‌ను పున:ప్రారంభిస్తే పది వేల మంది ఎస్సీ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. దీనిని సింగరేణి అనుబంధ పరిశ్రమగా గుర్తించి ఆ కార్మికులకు అవసరమయ్యే బూట్లు, గ్లౌజులు, టోపీలు, బెల్టుల తయారీ పనిని ఈ లెదర్ సెంటర్‌కు ఇప్పిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు.
శిక్షణ పొందినవారికి రుణాలు, తదితర సౌకర్యాలను కల్పిస్తే వారు ఉపాధి పొందుతారని వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో లెదర్ పార్క్ వంటి పరిశ్రమలకు ప్రభుత్వం నిధులను కేటాయించి, బలహీన వర్గాల యువతకు శిక్షణ ఇచ్చి చేయూతనందించాలని కోరారు. లెదర్ పార్క్‌కు కేటాయించిన స్థలాన్ని ఇతర రంగాలకు కేటాయించొద్దని ఆయన డిమాండ్ చేశారు.