Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీ మహిళ రాష్ట్రపతి కాబోతున్నది : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారనీ, ఆ మహనీయుడి వారసుడు మోడీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ కొనియాడారు. దేశంలో తొలిసారి ఓ ఎస్టీ మహిళ రాష్ట్రపతి కాబోతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్డీఏ తరఫున ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. ఆదివాసీ, గిరిజన సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. బండి సంజయ్‌ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ఇన్చార్జి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మాజీ మంత్రి, సీనియర్ నేత రవీంద్రనాయక్, ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు అమర్ సింగ్ పవార్, బిక్కునాథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ..ఒక్క భారత్ తప్ప మిగతా దేశాలన్నీ తమ రాజ్యాంగాలను మార్చుకున్నాయని గుర్తుచేశారు. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను రాష్ట్రపతులుగా చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందని చెప్పారు. కులాలకతీతంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యం బీజేపీ హయాంలో నెరవేరుతున్నదన్నారు. పేదలకు న్యాయం జరగాలనే మోడీ అనే సంస్కరణలు తీసుకొస్తున్నారనీ, ఇది గిట్టని కొన్ని శక్తులు రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నాయని తెలిపారు. ఎస్టీ మహిళ ద్రౌపది ముర్మను రాష్ట్రపతిగా చేస్తున్న ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. జులై మూడో తేదీన హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభకు ప్రతి ఎస్టీ కుటుంబం నుంచి అందరూ హాజరు కావాలని కోరారు. రవీంద్రనాయక్ మాట్లాడుతూ..కొండకోనల్లో ఉన్న తమ జాతికి దేశానికి ప్రథమ పౌరురాలిగా అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.