Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో వసతులు మెరుగు పర్చాలని గిరిజన స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులతో ఆమే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన అన్ని చట్టాలపై దృష్టి సారించాలన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావటంతో గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో యుఆర్జేసీలో చదువుతున్న విద్యార్థులు ఆనారోగ్యంతో, మరొకరు పురుగులమందు సేవించి మరణించిన ఘటనలపై మంత్రి స్పందించారు. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో ఆశ్రమ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు అందాల్సిన యూనిఫామ్, పుస్తకాలు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలతో పాటు ఇతర సౌకర్యాలన్నింటినీ సత్వరమే కల్పించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు వారికి మెనూ ప్రకారం భోజనం అందేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా పోడు భూముల సమస్య ఎక్కడైనా తలెత్తితే వెంటనే పరిష్కార దిశగా కృషి చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.