Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఆర్సీ చైర్మెన్‌కు సీపీఐ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హన్మకొండలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనీ, కఠినంగా శిక్షించాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి సీపీఐ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హెచ్ఆర్సీ చైర్మెనన్ జస్టిస్ బి చంద్రయ్యను శుక్రవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర ఇన్‌ఛార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కలపల్లి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో బాధితులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రే భిక్షపతి ఉన్నారు.
అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మద్దతుతో హన్మకొండలో భూమాఫియా పేదలపై దాడులకు తెగబడుతోందని విమర్శించారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులకు గురైన బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు పెట్టడం లేదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గాంధీ మార్గంలో నిరాహారదీక్ష చేస్తామంటే అనుమతి ఇవ్వడం లేదన్నారు. వరంగల్ సర్కార్, మాఫియా గ్యాంగ్ కలిసి పాలిస్తున్నాయని విమర్శించారు. హన్మకొండలో పోలీస్ రాజ్యం నడుస్తుందన్నారు.