Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు టీయుఎంహెచ్‌ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
108 అంబులెన్స్ సర్వీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టియుఎంహెచ్ఇయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ నేతృత్వంలో ప్రతినిధులు రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతామహంతికి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ఇతర సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరారు. దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభమయ్యాయని వారు ఈ సందర్భంగా తెలిపారు. అప్పట్నుంచి ప్రయివేటు సంస్థల నిర్వహణ వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పోరాటాల ఫలితంగా కొన్ని సమస్యలు పరిష్కారమయినప్పటికీ, మరి కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని వారు పేర్కొన్నారు. 108 సర్వీసుల నిర్వహణకు ప్రభుత్వమే వంద శాతం నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో వాటిని నేరుగా సర్కారే నడపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సర్వీసుల్లో రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న 1,700 మంది ఉద్యోగులకు చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం నిర్వహించకపోతే అదే ప్రయివేటు సంస్థ ఉద్యోగులకు కార్మిక చట్టాలు, ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని కోరారు. గతంలో మాదిరిగా మూడు రోజులకు ఒక ఆఫ్ ఇవ్వాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగా పైలెట్లకు రూ.28 వేలు, ఈఎంటీలకు రూ.30 వేలు వేతనం ఇవ్వాలన్నారు. టెండర్ల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దాని కన్నా ముందే ఉద్యోగులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర చట్టబద్ధ సౌకర్యాలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2018 సమ్మె కాలంలో తొలగించిన ఉద్యోగులందరిని విధుల్లోకి తీసుకోవాలనీ విజ్ఞప్తి చేశారు. ఏ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినా ఉద్యోగుల డేట్ ఆఫ్ జాయినింగ్ మారకూడదనీ పేర్కొన్నారు.108 అంబులెన్స్ వాహనాలకు మరమ్మతులు చేయించాలనీ, 2016 నుంచి రావాల్సిన 10 శాతం ఇంక్రిమెంట్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు.