Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్ఐఏ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన శిల్ప, స్వప్న, దేవేంద్రలను వెంటనే విడుదల చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎన్ఎస్ఎస్లో చైతన్య మహిళా సంఘం, పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదారేండ్ల కింద విశాఖలో మిస్సయిన రాధ కేసుతో ముడిపెట్టి ఇప్పుడు వీరిని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. నిజాయితీగా, విలువల కోసం బతికేవారిలో, ప్రశ్నించేవారిలో భయపెట్టేలా కేసులు పెట్టడం అన్యాయమన్నారు. చైతన్య మహిళా సంఘం 30 ఏండ్ల నుంచి మహిళల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సంస్థ అని గుర్తుచేశారు. ఎవరో ఏదో చెబితే ఓ వ్యక్తి మావోయిస్టు పార్టీలోకి వెళ్తారా? తన సమస్యలు పరిష్కారం కోసమో, సమాజ మార్పు కోసమో పోయేవారు ఇతరులకు చెప్పిపోతారా? అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారందరినీ అరెస్టు చేసుకుంటూపోతే ఎన్ఐఏ విశ్వసనీయత కోల్పో తుందనీ, దాన్ని ప్రజలు నమ్మరని సూచించారు. బీజేపీలోని నేతలంతా సుద్దపూసలు..మిగతా పార్టీల్లోని నేతలంతా నిజాయితీ పరులు కాన్నట్టుగా ఎన్ఐఏ, సీబీఐ, ఈడీ దాడులు పెరిగిపోతున్నాయనీ, ఆయా పార్టీల నేతలను పలు సంస్థల ఒత్తిళ్లతో బెదిరించి బీజేపీలో చేర్చుకుంటున్నారని విమర్శిం చారు. ఇలాంటి ధోరణి ఎల్లకాలం కొనసాగదనీ, ప్రజలు బీజేపీకి కచ్చితంగా బుద్ది చెబుతారని హెచ్చరించారు. చైతన్య మహిళా సంఘం కన్వీనర్ బి.జ్యోతి, కో.కన్వీనర్ కె.శ్రీదేవి మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీతో, తమ సంఘానికి ఎలాంటి సబంధం లేదని నొక్కి చెప్పారు. తమ సంఘం మహిళా సమస్యలపైనే పోరాడుతున్నదన్నారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్.నారాయణరావు, పీవోడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ, కుల అసమానత నిర్మూలనా పోరాట సమితి నాయకులు బండారి లక్ష్మయ్య, పీడీఎమ్ నాయకులు రాజు, తదితరులు పాల్గొన్నారు.