Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై నాలుగున చలో ప్రగతి భవన్ : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూములకు చట్టబద్ధ హక్కులు కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పీఓడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షులు జీ ఝాన్సీ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు అరుణతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. పోడు రైతులు సాగు చేస్తున్న భూములకు ఏ విధమైన హక్కు పత్రాలు లేకపోవటంతో చట్టబద్ధ హక్కులు వర్తించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు బంధు, బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, పంటల బీమా సౌకర్యం తదితరాలను పొందలేక పోతున్నారని చెప్పారు. మరో పక్క పేదలకు ఏదో ఒక పేరుతో రేషన్ కార్డులు రద్దు చేశారని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ కుటుంబాలకు కార్డులు ఇవ్వటం లేదని చెప్పారు. అర్హులైన వారందరికీ ఫించన్లు రావటం లేదని ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదని ఆరోపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం చేసిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయా సమస్యల పరిష్కారం కోసం జూలై నాలుగున చలో ప్రగతి భవన్ పేరిట ముట్టడి చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంస్, పీఓడబ్ల్యు కార్యకర్తలు కూడా పాల్గొంటారని తెలిపారు.