Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాలు భర్తీ చేయాలి
- ఎస్టీ కమిషన్, ట్రైబల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలి
- 'గిరిజన రిజర్వేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరి' : చర్చాగోష్టిలో వక్తలు
నవతెలంగాణ- ఓయూ
గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను, రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓయూలో గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ అధ్వర్యంలో 'గిరిజన రిజర్వేషన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరి' అంశంపై అడ్వకేట్లు, మేధావులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని, ఈ విద్యా సంవత్సరంలోనే ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించాలని, తండా డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. తండాలను గ్రామ పంచాయతీలుగా, రెవెన్యూ గ్రాపంచాయతీలుగా గుర్తించాలన్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడిస్తామని హెచ్చరించారు. అన్ని గిరిజన, ప్రజాసంఘాలతో కలిసి రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇండ్ల ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గిరిజనులను ఓటు బ్యాంకుగా కాకుండా, వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు, అడ్వకేట్ డాక్టర్ ధనుంజరు, లా కళాశాల డీన్ ప్రొ.గాలి వినోద్‌కుమార్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ధర్మానాయక్, శ్రీరామ్‌నాయక్, తెలంగాణ గిరిజన సమాఖ్య కార్యదర్శి అంజయ్య నాయక్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకటేష్ చౌహన్, ఓయూ జేఏసీ చైర్మెన్ మందల భాస్కర్, ఓయూ యుద్ధనౌక వరంగల్ రవి, హైకోర్టు అడ్వకేట్ కట్రవత్ శంకర్ నాయక్, లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉదరు, ఎన్టీఎఫ్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెడ శ్రీను, గిరిజన శక్తి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు జ్యోత్న్స నాయక్, నాయకులు డాక్టర్ రాజారాం నాయక్, రవి నాయక్, కార్తీక్ నాయక్, రాజశేఖర్, సురేందర్ నాయక్, హరినాయక్ పాల్గొన్నారు.