Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
- రెడ్కో చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను పెంచి పోషిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ విధానమనే ఐక్యతను విచ్ఛిన్నం చేయడమనీ, అధికారం కోసం ఆపార్టీ ఎంతకైనా దిగజారుతుందని అన్నారు. అలాంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) నూతన చైర్మెన్‌గా యెరువు సతీష్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన అభినందన సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు సతీష్‌రెడ్డిని సన్మానించి, అభినందనలు తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ దాస్యం వినరు భాస్కర్, శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ రావు, తాత మధు, శాసనసభ్యులు దానం నాగేందర్, మాగంటి గోపినాధ్, ఆరూరి రమేష్, కార్పొరేషన్ల చైర్మెన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, వాసుదేవరెడ్డి, గజ్జెల నగేష్, దామోదర్, రెడ్కో వైస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీ జానయ్య తదితరులు సతీష్‌రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్‌ను కాదని బీజేపీకి అవకాశం ఇస్తే ఆపార్టీ దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాట్సాప్ యూనివర్సిటీల కేంద్రంగా బీజేపీ అసత్య ప్రచారాలకు దిగుతోందని విమర్శించారు. గుజరాత్ నమూనా అని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు అదే రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టిందనీ, వ్యవసాయానికి ఆరు గంటలు కూడ కరెంట్ ఇవ్వలేక, పరిశ్రమలకు వారానికి రెండ్రోజులు పవర్ హాలిడే ప్రకటించిందని ఉదహరించారు. రెడ్కో నూతన చైర్మెన్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననీ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.