Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామకృష్ణాపూర్‌కు పూర్వ వైభవం: కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-రామకృష్ణాపూర్
ఇండ్ల పట్టాల పంపిణీతో రామకృష్ణాపూర్ దశ దిశ మారనుందని, పూర్వ వైభవం రానుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో శుక్రవారం మూడో విడతలో 408 మందికి ఇండ్ల పట్టాలు మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జీవో 76 తీసుకొచ్చి 2019లోనే ఇండ్ల పట్టాల పంపిణీ ప్రారంభించామన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పట్టాలు అందేలా చూస్తామని తెలిపారు. 18 ఏరియాల్లో సింగరేణి ప్రభావిత ప్రాంతమని, రిజెక్ట్ చేసిన ఏడు ఏరియాలను సింగరేణి సీఎండి శ్రీధర్‌తో మాట్లాడి తిరిగి లిస్టులో చేర్పించామని చెప్పారు. జీవో 76ను రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. సింగరేణి ఏరియాలో ఖాళీగా ఉన్న నాలుగువేల క్వార్టర్లను రెవెన్యూ శాఖకు అప్పజెప్పి నామమాత్రపు రుసుముతో పేద ప్రజలకు అందించేలా చర్యలు ప్రారంభిం చామన్నారు. ఆర్కే4 గడ్డ, శాంతినగర్, వల్లభాయినగర్, నాగార్జున కాలనీ, ప్రగతికాలనీ, రాజీవ్‌నగర్, ఠాగూర్‌నగర్, రామ్‌నగర్, భగత్‌సింగ్‌నగర్, గంగాకాలనీ, సూపర్ బజార్ ఏరియా, దుర్గారావు మార్కెట్, గీతామందిర్ ఏరియాలో మిస్సయిన ఇండ్లను తిరిగి చేర్పించామన్నారు. మూతబడిన గనుల వల్ల రామకృష్ణాపూర్ పట్టణ ప్రాముఖ్యత దిగజారిపోయిందని, నేడు ఇండ్ల పట్టాలతో పూర్వవైభవం సంతరించుకోనుందని చెప్పారు. ఇండ్ల పట్టాలతో తక్కువ ఖర్చుతో సొంత ఇంటి నిర్మాణాలు చేసుకోవచ్చన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు త్వరలోనే పూర్తవుతున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థ కూడా మరింత మెరుగవ్వనుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.