Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు సమస్యను పట్టించుకోవడంలేదు : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ల్ చేరిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదివాసీలపై ముఖ్యమంత్రి కేసీఆర్కు చిన్నచూపు ఉందనీ, అందుకే పోడు భూముల సమస్యను పట్టించుకోవడంలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూముల్లో దుక్కి దున్ని సాగు చేసుకుంటున్నవారిని పోలీసులు అరెస్టు చేసి హింసించారన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యుడు కాంతారావు తదితరులు రేవంత్ రెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. గాంధీభవన్లో ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 11 నెలల్లో ఎన్నికలు వస్తాయనీ, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో 10 స్థానాలను కాంగ్రెస్ గెెలుచుకుంటుందని వివరించారు.హరితహారం పేరుతో ఆదివాసీలపై దాడులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పోడు రైతులకు న్యాయం చేస్తామని చెబుతూనే పోలీసులతో వారిపై దాడులు చేయిస్తున్నారని, కేసులు పెట్టిస్తున్నారని చెప్పారు. గిరిజనుల భూములు లాక్కుని లే అవుట్లు వేస్తున్నారని మండిపడ్డారు. తాటి వెంకటేశ్వర్లు, కాంతారావుల చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. రైతు డిక్లరేషన్ అమలైతే .. రైతుల జీవితాలే మారిపోతాయన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి... పేదల ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. త్వరలోనే అశ్వారావుపేటలో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని, కాంగ్రెస్లో చేరికల తుపాన్ రాబోతోందని అని రేవంత్ వ్యాఖ్యానించారు.
మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రుణమాఫీ హామీని ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదు. హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు నిర్మిస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరణి వల్ల ప్రతీ రైతూ ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. పినపాక ఎమ్మెల్యేకు భూ కబ్జా, ఇసుక మాఫియాపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు.