Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పెన్షన్ విధానం కొనసాగించాలి : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సాధన కమిటీ డిమాండ్
- సీఎమ్‌డీ ప్రభాకరరావుకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, విద్యుత్ ఉద్యోగులతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సాధన కమిటీ డిమాండ్ చేసింది. 1999 నుంచి ఇప్పటి వరకు రిక్రూట్ అయిన ఉద్యోగులు అందరికీ దీన్ని వర్తింపచేయాలని కోరింది. ఈ మేరకు టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావుకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. కమిటీ ఇంజినీరింగ్ ప్రతినిధులు ఈ శ్రీనివాస్, హెచ్ మల్లేశం, పీ సురేష్‌బాబు, పీ ప్రేమ్‌కుమార్, అశోక్‌రావు, సంజీవ్, శ్రీధర్, విజరు, కృష్ణ, ప్రవీణ్ తదితరులు సీఎమ్డీని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసినట్టు అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయనీ, పంజాబ్ ఎన్నికల సమయంలో ఆప్ నాయకత్వం అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చిందనీ, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో దీని రద్దు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణలో కూడా సీపీఎస్‌ను రద్దు చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని చెప్పారు. విజ్ఞప్తి చేశారు. సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎమ్‌డీ ప్రభాకరరావును కోరామన్నారు. ఆయన దానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. డిమాండ్ సాధన కోసం యూనియన్లకు అతీతంగా విద్యుత్ ఉద్యోగులంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. 1999 నుంచి ఇప్పటి వరకు రిక్రూట్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీన్ని వర్తింప చేయాలని కోరారు.