Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ(యూ) రాష్ట్ర మూడో మహాసభల్లో వామపక్ష పార్టీల నాయకుల పిలుపు
నవతెలంగాణ-మియాపూర్
ప్రజాక్షేత్రంలో కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కలిసి ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల మల్లేశ్, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, ఎస్సీఐయూ రాష్ట్ర కార్యదర్శి మురహరి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్లో గురువారం ప్రారంభమైన ఎంసీపీఐ(యూ) రాష్ట్ర మూడో మహాసభల రెండో రోజైన శుక్రవారం వామపక్ష పార్టీల నాయకులు పాల్గొని సందేశాన్నిచ్చారు. భవిష్యత్తులో భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసికట్టుగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకువచ్చాయని విమర్శించారు. కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టి, పెట్టుబడిదారుల సంపద పెరిగేందుకు కృషి చేస్తున్నదని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలు పూర్తిగా తమ జీవన ప్రమాణాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంతాలపై విడిపోయినప్పటికీ కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలపై కలిసి గట్టిగా పోరాడుతాయని, భవిష్యత్తులో అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకనుగుణంగా ఎంసీపీఐ(యూ) రాష్ట్ర మహాసభలు ప్రజా వ్యతిరేక విధానాలపై తీర్మానించిన ప్రకారం పోరాటాలు నిర్వహించాలని తెలిపారు. వామపక్ష పార్టీల తరపున ఎంసీపీఐ(యూ)కి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మహాసభల్లో సీపీఐ(ఎం) నాయకులు శోభన్కృష్ణ, సీపీఐ నాయకులు నర్సింహారెడ్డి, ఎంసీపీఐయూ మురళి, మధు అనిల్, రమేష్, సుకన్య, అంగడి పుష్ప, సుల్తానా బేగం, లావణ్య, డ్రైవర్ రాజు, కన్నా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.