Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వామ్మో రవాణా..!
కమిషనర్‌గా రావాలంటేనే హడలెత్తుతున్న అధికారులు
- ఎంత ప్రయత్నించినా తగ్గని అవినీతి
- మాటవినని క్రిందిస్థాయి అధికారులు
- స్వతంత్ర నిర్ణయాలకు అవకాశం లేనివైనం
- కమిషనర్‌ను నియమిస్తూ జీవో ఇచ్చి నెల...
- బాధ్యతలు స్వీకరించని జ్యోతి బుద్ధ ప్రకాష్
నవతెలంగాణ-హైదరాబాద్/సిటీబ్యూరో
రవాణాశాఖ కమిషనర్‌గా రావాలంటేనే అధికారులు హడలెత్తుతున్నారు. నిత్యం జనంతో మమేకమయ్యే ఈ శాఖపై కమిషనర్లకు ఎలాంటి ప్రత్యేక అధికారాలు లేకపోవడమే కారణమనే చర్చ రవాణాశాఖలో నడుస్తున్నది. ఆర్టీసీ మొదలు అన్ని రవాణా రంగాలు ఈ శాఖ పరిధిలోనే ఉండటం, అధికారిక నిర్ణయాలన్నీ రాజకీయ ఒత్తిళ్లకు లోబడే ఉండాల్సి రావడంతో ఇక్కడ పనిచేసేందుకు అధికారులు ఆసక్తి చూపట్లేదు. దానికి తోడు వ్యవస్థీకృతమైన అవినీతిని ప్రక్షాళన చేయడం కమిషనర్లకు కత్తిమీద సాముగా మారింది. జిల్లాల సంగతి దేవుడెరుగు... స్వయంగా హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణామంత్రి, కమిషనర్ కార్యాలయాలే అవినీతి అడ్డాలుగా మారాయని ప్రచారం జరుగుతున్నది. గతంలో ఆఫీసు బయట ఫుట్‌పాత్‌లపై ఉండే ప్రయివేటు బ్రోకర్లు, ఇప్పుడు నేరుగా కార్యాలయాల లోపలే తిష్టవేశారు. దీన్నిబట్టి ఈ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీ కార్మికుల 52 రోజుల సమ్మె సందర్భంగా అప్పటి కమిషనర్, ప్రస్తుత ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ నిర్వహించిన పాత్రపై ఐఏఎస్ అధికారుల్లోనే తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. సమ్మెపై స్వయంగా నిర్ణయం తీసుకోలేక, దాన్ని విఫలం చేయడం కోసం కేవలం ప్రభుత్వం ఏం చేయమంటే అదే చేసిన స్థితిని చూశాక, ఇటువైపు కన్నెత్తి చూసేందుకు ఐఏఎస్ అధికారులు జంకుతున్నారు. సునీల్‌శర్మ తర్వాత నిన్న మొన్నటి వరకు ఉన్న కమిషనర్లు ఎవరూ పూర్తికాలం ఇక్కడ పనిచేయలేదు. ప్రాధాన్యత లేని పోస్టులు అయినా సరే... ఇక్కడి నుంచి వెళ్లిపోతే చాలు అన్నట్టే వ్యవహరించారు. దానికి తోడు ఈ శాఖలో విపరీతమైన రాజకీయజోక్యం అధికారుల్ని మెసలనివ్వట్లేదనేది క్రిందిస్థాయి ఉద్యోగుల మాట! మొన్నటి వరకు ఈ శాఖ కమిషనర్‌గా పనిచేసిన ఎమ్‌ఆర్‌ఎమ్ రావు అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెర్రిటరీ (ఏజీఎమ్యూటీ) కేడర్‌కు చెందిన అధికారి. కేవలం రెండేండ్ల డిప్యుటేషన్‌పై ఆయన రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌గా నియ మితులయ్యారు. ఈ ఏడాది మే 19వ తేదీ ఆయన్ని మాతృసంస్థకు సరెండర్ చేసి, రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధప్రకాష్‌ను రవాణాశాఖ కమిషనర్‌గా (జీవో ఆర్టీ నెం1046) నియమిం చారు. నెలరోజులు దాటినా ఆయన ఇప్పటికీ ఆ బాధ్యతలు స్వీకరించలేదు. ఇప్పటికీ ఆయన చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగానే పనిచేస్తున్నారు. ఆ పోస్టులో మరొకరిని నియమించకపోవడంతో అక్కడే కొనసాగుతున్నారు. రవాణాశాఖ బాధ్యతలు తీసుకోకపోవడమే మంచిదని చెప్తూ సన్నిహితులు సాదకబాదకాలన్నీ ఏకరువు పెట్టడంతో ఆయన ఆ బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించినట్టు తెలుస్తున్నది. రవాణాశాఖ కమిషనర్‌గా సందీప్‌కుమార్ సుల్తానియా కూడా ఇక్కడ స్వల్పకాలమే పనిచేశారు.
టార్గెట్ల భయం
ప్రభుత్వానికి ఆదాయం తీసుకువచ్చే శాఖల్లో రవాణాశాఖ ముఖ్యమైనది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే లైఫ్ ట్యాక్స్, తైమ్రాసిక పన్ను, ఫీజులు, సర్వీసు చార్జీలు, డిటెక్షన్లు, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఏటా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి అర్జించి పెడుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది టార్గెట్‌ను పెంచుకోవడం అనవాయితీ. అయితే ఆదాయ సముపార్జనకు శాఖలో స్వతంత్రించి నిర్ణయాలు తీసుకొనే అవకాశం కమిషనర్లకు లేకపోవడమే అసలైన సమస్య. తీసుకొనే నిర్ణయాలు కూడా ఆఫీసులో కూర్చుని ఆర్డర్లు పాస్ చేసేలా ఉండాలే తప్ప, ఎక్కడా ఫీల్డ్ విజిట్ వంటివి చేయకూడదనే రాజకీయవత్తిళ్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. రాజకీయంగా ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఇక్కడి అధికారులకు అనధికారికంగా నెలవారీ టార్గెట్లు ఇచ్చి ' మా వాటా ఏది?' అని నేరుగానే అడుగుతున్నట్టు కమిషనర్ కార్యాలయంలో చర్చ జరుగుతున్నది. దీనికోసం కిందిస్థాయి అధికారులను అజమాయిషీ చేయాల్సి రావడం, వారు దుష్ప్రచారం చేయడం వంటివి ఈ శాఖలో కామన్ అంశాలుగా మారాయని వినికిడి. కమిషనర్ పోస్టులో ఉండి అందరితో చెడు అనిపించుకునేకంటే, ప్రాధాన్యత లేని పోస్టయినా సరే...ఎక్కడో ఒకచోట ప్రశాంతంగా ఉంటే చాలని భావిస్తూ అధికారులు ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతున్నది. నెలరోజులు దాటినా జ్యోతి బుద్ధ ప్రకాష్ చార్జి తీసుకోకపోవడానికి ఇదే కారణమని ఆ శాఖలోని అధికారులు చెప్తున్నారు. చేనేత, జౌళిశాఖ పనులకే సమయం సరిపోతుందనీ, రవాణాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారనే విషయం కూడా తనకు తెలియదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.
గాడితప్పిన పాలన
రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖకు 54 కార్యాలయాలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిలో రోజుకు ఐదువేలకు పైగా వివిధ రకాల లావాదేవీల జరుగుతుంటాయి. ప్రజలకు ఏదైనా సమస్య తలెత్తిత్తే ఎవరికి చెప్పుకోవాలో తెలీని అయోమయ పరిస్థితి నెలకొంది. సర్వీస్ మ్యాటర్స్, రోజువారి రెవెన్యూ స్టేటస్, ఖర్చులు, రెవెన్యూ పెంపునకు చర్యలు, ఇతర సమీక్షలు వంటివి ఏవీ జరగట్లేదు. నెలరోజులుగా కమిషనర్ ఆమోదం కోసం పెండింగ్ ఫైల్స్ గుట్టలుగా పేరుకుపోయాయని ఆ పేషీ సిబ్బంది చెప్తున్నారు. వాహన ఫిట్నెస్, లేట్ ఫెనాల్టీ రద్దు కోసం ట్రాన్స్‌పోర్టు రంగ కార్మికులు రెండు నెలలుగా పోరాడుతున్నారు. వందలాది మంది ఆటో, క్యాబ్, ట్రాలీ కార్మికులు ఫిట్నెస్ భయానికి ఆటోలను రోడ్లపైకి తేవట్లేదు. దీనిపై సత్వర నిర్ణయం కమిషనర్ స్థాయిలోనే తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా రవాణాశాఖపై ప్రత్యేక దృష్టి పెడితే పలురంగాల కార్మికుల సమస్యలతో పాటు, ప్రజలకూ అవినీతి రహిత, మెరుగైన సేవలు అందే అవకాశాలు ఉన్నాయి.