Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టపరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెడ్తున్నారు
- నిమ్జ్ నిర్వాసితుల ఆవేదన
- 12,635 ఎకరాలకు 2892 ఎకరాలు సేకరణ
- నిధులివ్వని కేంద్రం.. అరకొరగానే రాష్ట్రం నిధుల కేటాయింపు
- నష్టపరిహారం ఇవ్వడంలో తాత్సారం
- కనీస సౌకర్యాలు లేకుండానే 'వేం' పరిశ్రమకు శంకుస్థాపన
నవతెలంగాణ-జహీరాబాద్
జహీరాబాద్‌లో జాతీయ పారిశ్రామిక ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు అత్యంత విలువైన భూములను రైతుల నుంచి బలవంతంగా లాగేసు కుంటున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు తీసుకుని.. సరైన నష్టపరిహారం ఇవ్వ కుండా పాలకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయలేదని, పడావుగా పెట్టి ఉంచారని అన్నారు. పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. ఇదేంటని ఇటీవల తమ ప్రాంతానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను అడిగేందుకు ప్రయత్నిస్తే పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
జహీరాబాద్‌లో జాతీయ పారిశ్రామిక ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఆ సమయంలో గీతారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత భూసేకరణ చేసేం దుకు టీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో ప్రణాళిక ను రూపొందించింది. అందుకోసం సిబ్బందిని కూడా రెండు బ్లాక్‌లుగా నియమించింది. ప్రతి బ్లాక్‌లో డిప్యూటీ కలెక్టర్‌తో సహా ఐదుమంది సిబ్బందిని నియమించింది. దీనికోసం 12,635 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.166 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు రూ.152 కోట్లు ఖర్చు చేసి 1310 ఎకరాల పట్టా భూమి, 1444 ఎకరాల అసైన్డ్‌మెంట్ భూమి, 137 ఎకరాల ప్రభుత్వ భూమి మొత్తంగా 2,892 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్నా ఆ స్థాయిలో నిధుల కేటాయింపు గానీ, పనులు గానీ లేవన్న విమర్శలు ఉన్నాయి. కేంద్రం ప్రభుత్వం కూడా నిమ్జ్‌పై నిర్లక్ష్యం వహిస్తున్నది. నిధులు విడుదల చేయడానికి కేంద్రం ఏ మాత్రం సుముఖత చూపట్లేదు. దీంతో భూ సేకరణలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఈ నేపథ్యంలో భూ సేకరణ, పరిశ్రమల మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయనప్పటికీ.. ఇటీవల వేం పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని రైతులు(నిర్వాసితులు) వ్యతిరేకిస్తున్నారు. నష్టపరిహారం చెల్లించకుండా మోసం చేయడం దారుణమని మండిపడ్డారు. రోడ్డు, ప్రహరీ, విద్యుత్, రైల్వే లింకేజీ, ఎయిర్ పోర్టు, రహదరుల అనుసంధానం, నీటి సౌకర్యాలు కూడా కల్పించలేదు.
ఏడాదికి మూడు పంటలు పండే భూములను కోల్పొయిన రైతులు ...
జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని పలు గ్రామాల నుంచి నిమ్జ్ ఏర్పాటు కోసం భూములను సేకరిస్తున్నారు. ఇందులో ఏడాదికి మూడు పంటలు పండే భూములు ఉండటంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ భూముల పైనే ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నామని, అలాంటి భూముల ను ప్రభుత్వం లాక్కోవడం సరికాదంటున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలంటున్నారు.
మూడు పంటలు పండే భూములను లాక్కున్నారు
ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను నిమ్జ్ పేరిట లాక్కున్నారు. ఆ భూముల్లో ఇప్పటి వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. మాకు సాగు చేసుకోవడానికి కూడా ఇవ్వడం లేదు. మా తాత ముత్తాతల నుంచి సాగు చేసుకునే భూములు పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం.
రాములు, భూ నిర్వాసితుడు
నాణ్యవంతమైన భూములను కోల్పోయాం
మెరుగైన సారం కలిగిన భూములను ప్రభుత్వం నిమ్జ్ ఏర్పాటు చేస్తామని సేకరించింది. నామ మాత్రంగానే నష్టపరిహారం చెల్లించింది. భూములు పోయి నా.. పరిశ్రమలతో ఉపాధి వస్తుందని ఆశించాం. కానీ నేటికీ పరిశ్రమల ఏర్పాటు జరుగలేదు. దాంతో అటు భూములు పోయి, ఇటు ఉపాధి లేక రోడ్డున పడ్డాం.
- సిద్ధారెడ్డి, భూ నిర్వాసితుడు
2013 భూసేకరణ చట్టం ద్వారానే భూ సేకరణ
జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో 12,635 ఎకరాల భూమిని నిమ్జ్ ఏర్పాటు కోసం సేకరిస్తున్నారు. ఇందులో సారవంతమైన ఏడాదికి మూడు పంట లను పండించే భూములు ఉన్నాయి. రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంటే సీపీఐ(ఎం), వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిమ్జ్ భూ బాధితుల సంఘంను ఏర్పాటు చేసి పోరాడుతు న్నాం. 2013 భూసేకరణ చట్టం ద్వారానే భూ సేకరణ చేయాలి.
- నిమ్జ్ భూ బాధితుల సంఘం అధ్యక్షులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.రాంచందర్