Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం మాటలు నీటిమూటలేనా?
- నామ్‌కే వాస్తేగా సబ్‌కమిటీ
- సమీక్షలకే పరిమితమైన మంత్రి సత్యవతి రాథోడ్
- మూలన పడ్డ 3.40 లక్షల దరఖాస్తులు
- 12లక్షల ఎకరాలకు సంబంధించిన పోడు రైతులు ఆందోళన
- 2,450 గ్రామాల రైతుల గోడు
- వ్యవసాయ సీజన్ ప్రారంభంతో సాగుకు సన్నాహాలు
- హక్కు పత్రాల కోసం ఎదురుచూపులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూముల సమస్య పరిష్కారానికి గతేడాది నవంబరు ఎనిమిది నుంచి డిసెంబరు ఎనిమిది వరకు గ్రామాలవారీగా గిరిజనులు, ఇతరుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. అంతకుముందే వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి, అటవీ హక్కుల (ఆర్వోఎఫ్ఆర్) చట్టం ప్రకారం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు, మూడు గ్రామాలకు ఓ నోడల్ అధికారిని నియమించాలనీ,.. గ్రామ, సబ్‌డివిజన్, ఆర్డీవో, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలనీ, ఈ ప్రక్రియను నవంబరు ఒకటి కల్లా పూర్తిచేయాలని కలెక్టర్లకు సూచించారు. 2021 అక్టోబర్ 22న పోడుపై సమీక్షలో సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.'హక్కు పత్రాల కోసం దరఖాస్తులు పెట్టుకోమంటే నవంబర్లోనే పెట్టుకున్నాం. ఎనిమిది నెల్లయింది. ఇంత వరకూ అతీగతీ లేదు. భూమిలోకి ఫారెస్టోల్లు రానీయటం లేదు. కందకాలు తొవ్వుతున్నరు. హద్దులు పెడుతుండ్రు. సర్కార్ చెప్పేదొకటి చేసేదొకటిగా ఉంది' -ఊకె భద్రయ్య, గుండాల.
ఇది ఒక్క ఊకె భద్రయ్య పోడు గోడే కాదు.. రాష్ట్రంలో 2021 నవంబర్, డిసెంబర్ నెలలో 3.40 లక్షల దరఖాస్తులు చేసుకున్న రైతుల ఆవేదన ఇది. సుమారు 12లక్షల ఎకరాలకు సంబంధించి, 4,300 గూడేలకు చెందిన 2,400 గ్రామాల పోడు రైతుల ఆందోళన ఇది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావటంతో ఇప్పుడు వారి గుండెల్లో మరింత గుబులు మొదలైంది. బతుకుదెరువైన పోడు వ్యవసాయంపై ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వారు ప్రశ్నిస్తున్నారు.
పోడు భూములకు హక్కు పత్రాలిస్తామని గత ఎనిమిది నెల్ల క్రితం హడావిడి చేసిన రాష్ట్ర సర్కారు ఆ సమస్యను మూలన పడేయటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగమేఘాల మీద పోడు సమీక్ష నిర్వహించి, సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్ మాట నీటి మూటేనా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
సాగదీతకోసమే..
ఈ నేపథ్యంలో పోడు రైతుల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అనుసరిస్తున్నదనేది విదితమవుతున్నది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నది. ఆరు నెలల నుంచి రకరకాల పేరుతో అది సమస్యను సాగదీస్తున్నది. అనేక చోట్ల పోడు కమిటీలను ఇప్పటికీ వేయలేదు. సాగుభూమికి సంబంధించిన ఆధారాలు నేటికీ తీసుకోలేదు. 'ఒకే సారి పరిష్కారం' (వన్‌టైం సెటిల్మెంట్)కింద సాగులోని భూములకు పట్టాలిస్తామని ప్రభుత్వం చెప్పింది. భవిష్యత్‌లో కొత్త పోడు సాగుకు అనుమంతించబోమని నాడు ప్రకటించింది. మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యాన 'పోడు భూముల సబ్ కమిటీ'ని ఏర్పాటు చేసి, ప్రాంతాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, పట్టాలు ఇస్తామని చెప్పింది. అయితే దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు దాటినా క్షేత్ర స్థాయిలో ఎక్కడా పనిశీలన చేసిన దాఖలాలు లేవు. కానీ.. సంక్షేమ భవన్లో మాత్రం సమీక్షలు కొనసాగుతుండడం గమనార్హం.
ప్రతి ఏటా లొల్లి..
హద్దులు దాటి పోడు భూములను సాగు చేస్తే అడ్డుకుని తీరుతామని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రతి ఏటా ఆదివాసీ ప్రాంతాల్లో లొల్లి జరుగుతున్నది. చదును చేసుకున్న పోడు భూముల్లో పంటలు వేసి తీరుతామని గిరిజన రైతులు అంటుంటే.. పంటలు చేతికొచ్చే సమయంలో అధికారులు పంటలపై దాడులు చేసి ధ్వంసం చేస్తున్నారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వస్తున్నది. కొన్ని చోట్ల చదును చేసుకున్న భూముల్లో గుంతలు తవ్వి అధికారులు ముళ్లమొక్కలు నాటుతున్నారు. ఈ వివాదాలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ.. సర్కారు చోద్యం చూస్తుండడం గమనార్హం.
12లక్షల ఎకరాల్లో పోడు సమస్య..
రాష్ట్రంలో ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రం భీం- ఆసిఫాబాద్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్ సహా 24 జిల్లాల్లోని 12 లక్షల ఎకరాల్లో పోడు భూముల సమస్య ఉంది. గోండులు, కొలాంలు, నాయక్ పోడ్లు, బంజారాలు, కోయలు, తోటి లాంటి గిరిజన తెగలతోపాటు కొంత మంది గిరిజనేతరులు ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుని బతుకుతున్నారు. ఈ క్రమంలో పోడు భూములపై ఆదివాసీలకు సాగు హక్కులు కల్పించేందుకు నాటి కేంద్ర ప్రభుత్వం ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్- 2006' తెచ్చినా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలుకాలేదు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఈ సమస్యను 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ మరోసారి కదిలించారు. తాము అధికారంలోకి వస్తే ఆర్నెల్లలో పోడు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో అటవీ అధికారులు గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టి ఆడ, మగ తేడాలేకుండా జైళ్లకు పంపుతున్నారు. చాలామంది పోడు భూములను కోల్పోవటంతో పాటు కేసులపాలై ఏండ్లతరబడి స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో బాలింతలను సైతం వదలకుండా జైలుకు పంపటంతో సర్కారు విమర్శలపాలైన విషయం తెలిసిందే..
మాటలే.. చేతల్లేవ్..
రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల విషయంలో మాటలే తప్ప చేతలకు పోవటంలేదు. సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నది. దరఖాస్తులు స్వీకరించి ఆరు నెల్లయినా ఇంత వరకు అతీగతీ లేదు. పేరుకే పోడు భూముల సబ్‌కమిటి. అది ప్రకటనలకే పరిమితమైంది. ఇప్పుడు వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఎలాంటి హానీ తలపెట్టొద్దు. వారిపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు ' 2006 అటవీ హక్కుల చట్టం' ప్రకారం హక్కు పత్రాలివ్వాలి.లేదంటే ఉద్యమం తప్పదు.
- రమావత్ శ్రీరాం నాయక్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సంఘం