Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూతబడిన రైస్ మిల్లులను తెరిపించాలి
- సీఐటీయూ ఆధ్వర్యంలో ఎఫ్‌సీఐ కార్యాలయం ముందు హమాలీల మహాధర్నా
- సంఘీభావం తెలిపిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ-నల్లగొండ
కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. మూతపడిన రైసుమిల్లులను వెంటనే తెరిపించి కార్మికుల ఉపాధిని కాపాడాలన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆల్ హమాలీవర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో రామగిరిలోని ఎఫ్‌సీఐ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సేకరణను జూన్ 7వ తేదీ నుంచి నిలుపుదల చేయడంతో సుమారు 1500 రైస్‌మిల్లులు మూతపడ్డాయన్నారు. ఫలితంగా రెండు లక్షల మంది హమాలీలు, మిల్లు డ్రైవర్, దినసరి కూలీలు, గుమస్తాలు, ట్రాన్స్‌పోర్టు లారీ డ్రైవర్స్, ఎస్‌డబ్య్లూసీ, సీడబ్య్లూసీ, ఎఫ్‌సీఐ గోదాం హమాలీలకు పనిలేకుండా పోయిందని చెప్పారు. ధర్నాకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఎఫ్‌సీఐ సీఎంఆర్ బియ్యం సేకరణ నిలిపివేయడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 150 మిల్లులు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మిల్లుల్లో పనిచేసే హమాలీ కార్మికులకు, మిల్లు డ్రైవర్లు, స్వీపర్లు, గుమస్తాలతో పాటు గోదాముల్లో ఎగుమతి దిగుమతి చేసే హమాలీలకు పనిలేకుండా పోయిందన్నారు.
ప్రస్తుతం వాళ్లకు ఉపాధి లేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు ఇక్కడ పనులు లేక సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు. రైస్ మిల్లుల యజమానులు రెండేండ్ల నుంచి రైతుల దగ్గర ధాన్యం తీసుకున్నప్పటికీ.. ఎఫ్‌సీఐ సంస్థ సీఎంఆర్ బియ్యం సేకరణ నిలిపేయడంతో.. మిల్లుల్లో స్థలం లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ సమస్యలు.. సివిల్ సప్లరు, ఎఫ్‌సీఐ సంస్థల మధ్య సమన్వయ లోపం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 150కిపైగా మిల్లులు 20 రోజులుగా మూతపడ్డాయని చెప్పారు. వెంటనే బియ్యం సేకరణ కొనసాగించి, మిల్లులను తెరిపించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా అధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి, హమాలీ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, నాయకులు లక్ష్మీనారాయణ, డబ్బికార్ మల్లేష్, అవుతా సైదులు, సాగర్ల యాదయ్య, రామచంద్రం, నకిరేకంటి సుందరయ్య పాల్గొన్నారు.