Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రికి తెలంగాణ పాడి రైతుసంఘం విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రెండేండ్లుగా పాలరైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయనీ, ఆ డబ్బుల్ని వెంటనే ఇప్పించాలని తెలంగాణ పాడి రైతు సంఘం రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ డిమాండ్ చేసింది. అలాగే 50 శాతం సబ్సిడీతో దాణా సరఫరా చేయాలనీ, పశువుల ఇన్సూరెన్స్ డబ్బులు వెంటనే విడుదల చేయాలనీ కోరింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు లేఖ రాసినట్టు కమిటీ రాష్ట్ర కన్వీనర్ మంగ నర్సింహా తెలిపారు. ప్రయివేటు డైరీలు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను పాడి రైతులకు చెల్లించకుండా, అన్యాయం చేస్తున్నాయని చెప్పారు. పాల సేకరణలోనూ అనేక మోసాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం విదేశీ పాలు, పాలపొడిని దిగుమతి చేసుకుంటూ, ఇక్కడి రైతులకు నష్టం కలిగిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ దిగుమతులను నిషేధించాలనీ, లేకుంటే దిగుమతి సుంకాలను పెంచాలని డిమాండ్ చేశారు. నిర్దేశిత వెన్న శాతం ఉన్న పాలకు నిర్ణయించిన ధరతో పాటే ప్రోత్సాహకాలనూ అందించాలని కోరారు. వీటితో పాటు పలు డిమాండ్లతో కూడిన లేఖను మంత్రికి పంపామన్నారు.