Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కలిసిన హార్వర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డొమినిక్ మావో
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ గురుకులాల్లో, హాస్టల్లో చదువు కుంటున్న విద్యార్థుల చెంతకు ప్రముఖ విదేశీ విశ్వవిద్యా లయం హార్వర్డ్ చదువులు రాను న్నాయి. బీసీ సంక్షేమ శాఖ, ఉస్మానియా, హార్వర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నాయి. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డొమినిక్ మావో, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లేశం, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని శనివారం కలిసి తమ ప్రతిపాదన తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి బీసీ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ద్వారా తరగతులు నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రతిభ ఆధారంగా వంద మంది బీసీ విద్యార్థులను గుర్తించి వారికి పదిరోజులపాటు తరగతులు నిర్వహిస్తామనీ, ఉన్నత చదువుల కోసం హార్వర్డ్ యూనివర్సిటీలో చేరడానికి ఈ తరగతులు ఉపయోగపడతాయని వారు వివరించారు. భవిష్యత్‌లో వందశాతం స్కాలర్ షిప్ సాధించి ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు దోహదపడుతుందనీ, విదేశీ విద్యను అందుకునేందుకు అవసరమైన శిక్షణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హార్వర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డొమినిక్ మావోకి తాను రచించిన అమెజాన్ బెస్ట్ సెల్లర్ '' సెల్ఫీ ఆఫ్ సక్సెస్'' పుస్తకాన్ని బహుకరించారు.