Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజాం జాగీర్దార్‌కు చెందిన 20 ఎకరాల భూమి కబ్జా
- 20 ఏండ్లుగా భూమి కోసం పోరాటం ొ సర్వే పనులను అడ్డుకున్న గ్రామస్తులు
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నారి
నవ తెలంగాణ-రాయపోల్
సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన రాయపోల్‌లో నిజాం జాగీర్దార్‌కు చెందిన 20 ఎకరాల భూమి (సర్కార్ తోట) అమ్మకాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని భూమి.. గ్రామ పంచాయతీ పన్నులు చెల్లిస్తున్న భూమిని కొందరు అక్రమ పత్రాలు సృష్టించి ప్రయివేటు వ్యక్తికి అమ్మగా.. అతను మరొకరికి అమ్యే యత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి..
నిజాం నవాబుల పాలన అనంతరం ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మామిడి తోట, చింతతోట గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉంది. గ్రామ పంచాయతీ తరఫున పన్నులు చెల్లిస్తున్నారు. అయితే, ఈ భూమిపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. 2004లో జాగీర్దార్ వారికి వారసులు ఉన్నట్టు వారి పేరు మీద భూమి పత్రాలు సృష్టించి అమ్మారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రాయపోల్ గ్రామ ప్రజలు భూమి కోసం పోరాడుతూనే ఉన్నారు. రాయపోల్ మండల కేంద్రంలో సర్వే నంబర్ 720లో 15 ఎకరాల 20 గుంటలు, సర్వే నంబర్ 1391లో 5 ఎకరాల భూమి ప్రస్తుతం మాధవాచారి అనే వ్యక్తిపై రిజిస్ట్రేషన్ అయి ఉంది. అతను మరో వ్యక్తికి అమ్మడానికి ప్రయత్నించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.
శనివారం కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించడానికి వెళ్లగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అంబేద్కర్ చౌరస్తా రోడ్డుపై బైటాయించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సర్వే పనులను అడ్డుకునే క్రమంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. రాయపోల్ గ్రామంలో నిజాంకాలం నాటి 20 ఎకరాల భూమిలో తోట ఉందని చెప్పారు. నిజాం పాలన, జాగీర్దార్ వ్యవస్థ అనంతరం ఆ భూమి గ్రామ పంచాయతీ ఆధీనంలోకి వచ్చిందన్నారు.
ఆ భూమిలోని మామిడి తోట, చింతతోటను గ్రామస్తులమే అనుభవిస్తున్నామని తెలిపారు. ఆ భూమికి సంబంధించిన శిస్తు, పన్నులు మాత్రం గ్రామ పంచాయతీ తరఫున చెల్లించారని తెలిపారు. ఆ భూమిలో గ్రామస్తులు మొక్కలు నాటి చెట్లను పెంచి కష్టపడి పెంచినట్టు చెప్పారు. నిజాం జాగీర్దార్‌కు అప్పట్లో వెట్టిచాకిరీ చేశామని, అనంతరం ఆ భూమిని కాపాడుకుంటూ వచ్చామని అన్నారు. కొందరు అక్రమార్కులు జాగీర్దార్ మరణానంతరం వారికి వారసులు లేకున్నా అక్రమంగా వారసులను సృష్టించారని తెలిపారు. వారి పేరు మీద కాగితాలు తయారు చేసి ప్రయివేటు వ్యక్తులకు విక్రయించారని ఆరోపించారు. 2004 నుంచి దానిపై గ్రామస్తులందరం పోరాడుతున్నామని వివరించారు. అక్రమంగా కొనుగోలు చేసిన వ్యక్తి కోర్టును ఆశ్రయించి గ్రామస్తులపై కేసులు నమోదు చేయించాడన్నారు. ఆ భూమిని ఎంత మందికి విక్రయించాలని చూసినా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్ని రోజులకైనా సర్కార్‌తోట భూమి గ్రామస్తులకే చెందుతుందన్నారు. 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా భూ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. రాయపోల్ మండలం కొత్తగా ఏర్పడిందని, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మండల కార్యాలయాలు నిర్మించాలని కోరారు. ఈ విషయంపై తహసీల్దార్ శ్రీవల్లిని వివరణ కోరగా.. కోర్టు, కలెక్టర్ ఆదేశాల ప్రకారం సర్వే చేయడానికి వెళ్తే గ్రామస్తులు అడ్డుకున్నారని తెలిపారు. గ్రామస్తులు చట్టప్రకారం వెళ్తే భూ సమస్య పరిష్కారమవుతుందన్నారు.