Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీ మెడికల్ కాలేజీకి భౌతికకాయం అప్పగింత
- ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర
- జోహార్లర్పించిన సీపీఐ(ఎం)నేతలు రాఘవులు, తమ్మినేని
- పలువురు వామపక్ష, ప్రజాసంఘాల నాయకుల నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ప్రజాపోరాటాల్లో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకులు, ప్రజాస్వామిక హక్కుల కోసం, కమ్యూనిస్టుల ఐక్యత కోసం నిరంతరం పరితపించిన ఉద్యమనేత దుర్గంపుడి వెంకటకృష్ణ (77) ఇక లేరు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ..ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. డీవీ కృష్ణ 1945 ఆగస్టు 20న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల సమీపంలోని తేలుకుంట్ల గ్రామంలో జన్మించారు.తల్లిదండ్రులు నాగేంద్రమ్మ, వెంకప్పారెడ్డి ..డీవీ కృష్ణ మూడోఏటనే వ్యవసాయం నిమిత్తం నిజామాబాద్‌కు వచ్చారు. 1964లో నిజామాబాద్ సహకార చక్కర పరిశ్రమలో , ఆ తర్వాత కొంత కాలానికి కార్మిక శాఖలో ఉద్యోగిగా చేరారు. అప్పటికే కమ్యూనిస్టు రాజకీయాల పట్ల ఆకర్షితుడై 1970 ప్రాంతంలో ఉద్యమంలో పనిచేయటం ప్రారంభించారు. ఆయనకు ఒక కుమార్తె దీప ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి ఆదివారం అప్పగించారు. కూతురు, డివి కృష్ణ తమ్ముళ్లయిన సాయిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా సహాయ కార్యదర్శి పి.రంగారావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె.రమ, కేజీ రామచందర్, రాష్ట్ర కమిటి సభ్యులు, వివిధ జిల్లాల నాయకులు తదితరులు భౌతిక కాయాన్ని వైద్య కళాశాలకు అప్పగించారు. డీవీకే మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని వారు ఈ సందర్భంగా నివాళులర్పించారు. విప్లవోద్యమ నిర్మాణానికి, దాని అభివృద్ధికి తగిన రీతిలో సైద్ధాంతిక కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు డీవీకే భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన మార్క్స్ భవన్ ముందు ఉంచారు. పలువురు వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు పూలమాలేసి నివాళులర్పించారు.
ప్రజాపోరాటాల్లో కీలక పాత్ర : బీవీ రాఘవులు
డీవీ కృష్ణ గొప్ప ప్రజానాయకుడని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణలోనూ ప్రజాపోరాటాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విశాల ఐక్య ఉద్యమాల అవసరం పెరిగిందని చెప్పారు.ఇలాంటి సమయంలో డీవీ కృష్ణ లేకపోవటం బాధాకరమన్నారు. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు, ప్రజాపంథా పార్టీ శ్రేణులకు పీబీ తరఫున సానుభూతిని ప్రకటించారు.
వ్యక్తిత్వం కలిగిన మనిషి-తమ్మినేని
డీవీ కృష్ణ గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఉద్యమంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధృఢంగా నిలబడటం ఆయనకే చెల్లిందన్నారు. కొద్ది మాసాల క్రితం ఆయన్ను కలిసినప్పుడు కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యత గురించే ఎక్కువ సేపు మాట్లాడారని గుర్తుచేశారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, ఎండీ అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం శ్రీనివాస్, ఎస్వీ రమ ఉన్నారు.
ఆయన బాటలో తుదికంటూ పోరాడుతాం.-పి రంగారావు
బతికినన్నాళ్లూ సమాజ మార్పు కోసం పరితపించారని పి.రంగారావు ఈ సందర్భంగా చెప్పారు. మనం ఎన్నేండ్లు బతికామనేది ముఖ్యం కాదనీ, ఎట్లా బతికామనేది ముఖ్యమని చెప్పారు.సైద్దాంతికంగా, నిర్మాణ పరంగా ఆయన చేసిన కృషిని చివరికంటా కొనసాగిస్తామని చెప్పారు.
తీరని లోటు : మండవ వెంకటేశ్వరరావు
డీవీ కృష్ణ మరణం ఐక్య ఉద్యమాలకు తీరని లోటని మాజీ మంత్రి మండవ నివాళులర్పించారు. ఆయన మృదు స్వభావనీ, ప్రజాఉద్యమాల్లో అందరినీ కలుపుకుపోయేవారని గుర్తుచేసుకున్నారు.
తన వంతు పాత్ర పోషించారు : ప్రొ.కోదండరాం
సమాజ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో తన వంతు పాత్రను పోషించారని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం తెలిపారు. నిరంతరం సమాజాన్ని అద్యయనం చేసేవారని గుర్తుచేసుకున్నారు.
వివిధ పార్టీల, ప్రజాసంఘాల నాయకుల నివాళి..
పార్టీలో సైద్దాంతిక, నిర్మాణ పోరాటం చాలా గొప్పదనీ, ఆయన చర్చల సందర్భంలో వ్యవహరించిన ప్రజాస్వామిక పద్దతి నేటి తరానికి ఎంతగానో అవసరమని పలువురు నేతలు గుర్తుచేశారు. ఆయన లేని లోటు తప్పకుండా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి సూర్యం, జేవీ చలపతిరావు, వేములపల్లి వెంకట్రామయ్య, ఎంసీపీఐ(యు) కార్యదర్శి మద్దికాయల అశోక్, రాష్ట్ర్ర కార్యదర్శి జి రవి, న్యూడెమోక్రసీ జాతీయ నాయకులు ఎస్.వెంకటేశ్వరరావు, కె గోవర్దన్,సీపీఐ(ఎంఎల్)జాతీయ నాయకులు గుర్రం విజయకుమార్, వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్, జనశక్తి నాయకులు అమర్,ఎస్‌యుసీఐ రాష్ట్ర కార్యదర్శి మురహరి, రచయిత సతీష్‌చందర్, ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణ, కె సూర్యం, ఏఐకేఎంఎస్ నాయకులు రాయల చంద్రశేఖర్, గుమ్మడి నర్సయ్య, కె రంగయ్య, పీఓడబ్ల్యు కార్యదర్శి అరుణ, హన్మేష్, ఎస్ఎల్ పద్మ, పీడీఎస్యు నాయకులు రాము తదితరులు నివాళులర్పించి సంతాపాన్ని తెలియజేశారు.