Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాగునీటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు తప్పనిసరి
- నిధులుంటే మూడేండ్లల్లో పూర్తి
- రూ.6000 కోట్ల బకాయిలు
- నిధుల్లేక ఈ సీజన్ వృధా
నవతెలంగాణ ప్రత్యే ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రాభివృద్ధిని కేంద్రంలోని మోడీ సర్కారు అడ్డుకుంటున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆటంకాలను సృష్టిస్తున్నది. ఆయా పథకాలకు అత్తెసరు నిధులిస్తూ కాలయాపన చేస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులపై శీతకన్నేసింది. జాతీయ ప్రాజెక్టులేవీ రాష్ట్రానికి మంజూరు చేయకుండా భ్రష్ట రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి రావడమే పరమావధిగా ఉన్న బీజేపీకి, రాష్ట్రంలోని సాగునీటి అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రాజెక్టులకు విరివిగా కాసులిచ్చేందుకు కేంద్రానికి మనసు రావడం లేదు. రాజకీయమే తప్ప ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసింది. పరిస్థితులకు అనుగుణంగా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటమే తమ విధానమని చెప్పకనే చెబుతున్నది. చిత్తశుద్ధి కరువైంది. నిధుల కోసం పదే పదే కేసీఆర్ ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వెళ్లినా వాటిని చెత్తబుట్టలో పడేస్తున్నది. గట్టిగా అడిగితే పిల్లిమొగ్గలు వేస్తున్నది. నిధులివ్వకుండా రాష్ట్రంలోని భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తీవ్ర ఆలస్యానికి కారణమవుతున్నది. సుమారు లక్ష కోట్లు నిధులు వస్తేగానీ, వచ్చే మూడేండ్లల్లో ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. అప్పులడిగితే రకరకాల నిబంధనలు, మార్గదర్శకాలతో అడ్డుపడుతున్నది. సకాలంలో నిధులు ఇస్తే ఆయా కేంద్ర ఆర్థిక సంస్థలు, ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి వాటిని సమకూర్చుకునే అవకాశం కల్పించినా వచ్చే మూడు సంవత్సరాల్లో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి వీలుందని సాగునీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందుకు కేంద్రమే సైంధవుడి పాత్ర పోషిస్తూ రాజకీయం చేస్తున్నదనే విమర్శలు ఇప్పటికే మోడీ సర్కారు మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. నిధులు అందుబాటులో లేక వర్కింగ్ ఏజెన్సీలకు దాదాపు రూ. ఆరు వేల కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారిక సమాచారం. ఇవి గత ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది.
ప్రాజెక్టులు..రిజర్వాయర్లు
రాష్ట్రంలోని సాగునీటి వ్యవస్థ గోదావరి, కృష్ణా నదులపై ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. అధికారిక సమాచారం ప్రకారం గోదావరి బేసిన్ పరిధిలో 50 రిజర్వాయర్లు, కృష్ణా బేసిన్లో 24 రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పలు భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. 33 జిల్లాల్లో భారీ ప్రాజెక్టులు 12 పూర్తి కాగా, మరో 16 నిర్మాణంలో ఉన్నాయి. అలాగే మధ్య తరహావి 33 పూర్తి కాగా, మరో ఆరింటి పనులు కొనసాగుతున్నాయి.
ఏడాది సమయం వృధా
గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు పనులు నిధుల్లేక నెమ్మదించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్ మొత్తం డబ్బుల కోసం వెతుకులాట తప్పలేదని సమాచారం. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పదే పదే దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లినా ఉత్తచేతులతో తిరిగివస్తున్నారని అంటున్నవారూ లేకపోలేదు. అప్పులడిగితే ఎఫ్ఆర్బీఎం నిబంధనలను ముందుకు తెస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌కు మాత్రం గప్‌చుప్‌గా వేల కోట్లు ధారాదత్తం చేస్తున్నదనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలూ లేకపోలేదు.
లక్ష కోట్లు
పూర్తయినవి పోను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కోసం రూ. లక్ష కోట్లు అవసరమని సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ అంచనాగా ఉంది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తదితర ప్రాజెక్టులను ప్రభుత్తం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. ఈ రెండింటికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని, గులాబీ సర్కారు పదే పదే గతంలోనే కోరినా పెడచెవిన పెడుతున్నది. కుక్కకు బోక్కేసినట్టు అడపా, దడపా అత్తెసరు నిధులివ్వడమే తప్పితే, భారీగా మంజూరు చేయడం ద్వారా పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులెత్తించే పనిచేయడం లేదు. జాతీయ హోదా సంగతినే మరిచింది. అప్పులు సైతం తెచ్చుకోకుండా అడ్డుపడుతున్నది. కాళేశ్వరం దాదాపూ పూర్తయినా, ఇంకా కొన్ని నిధులు అవసరం. పాలమూరు రంగారెడ్డికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ. 20 వేల కోట్లు ఖర్చుపెట్టారు. మరో రూ. 40 వేల కోట్లు అవసరమని అధికారులే చెబుతున్నారు. మిగతా పెండింగ్ పనులున్న ప్రాజెక్టులు, భూసేకరణ పరిహారం, ఇతర అవసరాల కోసం రూ. 40 వేల కోట్లు తప్పనిసరని అభిప్రాయపడుతున్నారు. ఈ నిధుల్లో ఎక్కువభాగం భూసేకరణ పరిహారం, నిర్వాసితులకు పునరావాసం కిందే ఖర్చవుతాయని చెబుతున్నారు. నిధులు విరివిగా అందుబాటులో ఉంటే వచ్చే మూడేండ్ల కాలంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేయవచ్చని సాగునీటిశాఖ అధికారులు చెప్పడం గమనార్హం.