Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ తీరుకు వ్యతిరేకంగా నేడు నిరసన:తెలంగాణ బోధన వైద్యుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యక్తిగత భావ ప్రకటనా స్వేచ్ఛను కించపరిచే విధంగా డాక్టర్ ప్రతిభకు ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెడెంట్ మెమో ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం ఆస్పత్రిలో నిరసన తెలపనున్నట్టు తెలంగాణ బోధన వైద్యుల సంఘం (టీటీజీడీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డా. అన్వర్, డా జలగం తిరుపతి రావు , ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ మాదల, కోశాధికారి డాక్టర్ కిరణ్ ప్రకాష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉస్మానియా వైద్య కళాశాల ఆస్పత్రికి సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలు ఈ మధ్య కాలంలో ప్రచారంలో ఉన్నాయని వారు తెలిపారు. ఇలాంటివి ఎన్నో అంశాలు ఆ ఆస్పత్రి దీన స్థితిని ప్రతిబింబించే విధంగా గతంలోనూ పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వచ్చాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు, వీడియోలను లేదా పంచుకుంటూ తన భయాన్ని, ఆందోళన వ్యక్తం చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ప్రతిభకు మెమో ఇవ్వడం అన్యాయమని విమర్శించారు.ఆమె కేవలం తన భయాందోళన మాత్రమే వ్యక్తం చేశారే తప్ప, ఎక్కడ వాస్తవాలను వక్రీకరించలేదని స్పష్టం చేశారు. వెంటనే ఉస్మానియా సూపరింటెండెంట్ బేషరతుగా ఆ మెమోను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సోమవారం ఆ సంఘం నాయకులు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి డా ప్రతిభ సంఘీభావం తెలిపి, సూపరింటెండెంట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తామని వెల్లడించారు.