Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరుణ్ చుగ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తన సొంత రాష్ట్రం పంజాబ్‌లో ఏమి చేయలేకపోయిన బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తెలంగాణలో ఏమి చేస్తారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద, ముఠా గోపాల్, డాక్టర్ మెతుకు ఆనంద్, నోముల భగత్, ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రశ్నించారు. ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తరుణ్ చుగ్ ప్రజల తిరస్కారానికి గురయ్యారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్‌కు ఆయన ఏమి చేయలేదని విమర్శించారు. బీజేపీ కార్యాలయం వద్ద పెట్టిన సాలు దొర....సెలవు దొర డిజిటల్ బోర్డును తొలగించాలనీ, లేకపోతే రాష్ట్రమంతా మోడీ బోర్డులు పెట్టి చెప్పుల దండలు వేస్తామని హెచ్చరించారు. దేశానికి బీజేపీ చేసిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో విఫలమైన బీజేపీ విపక్షాల ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో అధికారంలోకి వస్తున్నదన్నారు. మోడీ బినామీ ఆదానీకి 2014కు ముందు ఆస్తులెన్ని? ఇప్పుడెన్ని? చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టే ముందు తెలంగాణకు ఏమి చేసిందో చెప్పాలన్నారు.