Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వాణిజ్య పన్నుల శాఖలో పెండింగ్ పన్నులను రాష్ట్ర ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కిందకు తెచ్చింది. ఈమేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ అమ్మకపు పన్ను చట్టం, తెలంగాణ విలువ ఆధారిత పన్ను చట్టం, కేంద్ర అమ్మకపు పన్ను తదితర చట్టాల కింద వివాదాస్పద పన్నులను సెటిల్ చేయడానికి ప్రభుత్వం ఓటీఎస్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే వివిధ రకాల పన్ను బకాయిలకు ప్రవేశపెట్టిన వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని లగ్జరీ ట్యాక్స్, వినోదపు పన్ను, ఆర్డీ సెస్సు, వృత్తి పన్ను, తదితర పన్నులకు కూడా ఓటీఎస్‌ను ఈ జీవో ద్వారా విస్తరింపజేసింది. ఈ పన్నులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మొత్తంలో సగం చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర అమ్మకపు పన్ను వివాదంతో సంబంధం లేకుండా ఓటీఎస్ కింద 50శాతం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. పన్నులు చెల్లించి అపరాధ రుసుము, వడ్డీ పెండింగ్ ఉంటే ఆ మొత్తంలో కేవలం 15శాతం చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది.