Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాదం, మూఢవిశ్వాసాలను అంతం చేయాలి:
- 'నేను నడచిన బాట' పుస్తకావిష్కరణలో సురవరం సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మతోన్మాదం, మూఢ విశ్వాసాలను అంతమొందించేలా మరోసారి ప్రజాపోరాటాలు రావాలని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. దానికోసం కళాకారులు, రచయితలు రంగంలోకి, భారతదేశ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పాటుపడాలని అభిలషించారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో ఫాసిజం విధ్వంసాన్ని సష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రంగస్థల, సినీ నటుడు, ప్రజా నాట్య మండలి, సీపీఐ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు రాసిన ''నేను నడిచిన బాట'' పుస్తకావిష్కరణ సభ ఆదివారంనాడిక్కడి మగ్ధూంభవన్‌లో జరిగింది. సినీ హిరో, దర్శక, నిర్మాత మాదాల రవి అధ్యక్షత వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ పుస్తక పరిచయం చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర ఇంచార్జి కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఇఫ్టా జాతీయ ఉపాధ్యక్షులు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ బీవీ విజయలక్ష్మీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి, ఏఐకేఎస్ అధ్యక్షులు రావుల వెంకయ్య, మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు, సినీ నిర్మాత పోకూరి బాబూరావు, సినీ దర్శకులు భీమినేని శ్రీనివాసరావు, మదినేని రమేష్, బాబ్జీ, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌తో పాటు తెలంగాణ ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజ పరిణామక్రమంలో జరిగిన అనేక మార్పులు, పార్టీ, యువజన, ప్రజా నాట్యమండలికి సంబంధించిన విలువైన సమాచారాన్ని 'నేను నడిచిన బాట' లో రచయిత ప్రస్తావించారని అన్నారు. నల్లూరి జీవిత చరిత్రలోని అనేక అంశాలను యువతరం చదివి తెలుసుకోవాలని, స్పూర్తి పొందాలని చెప్పారు. అలాగే జర్నలిస్టులు కూడా తమ జీవిత చర్రితలు రాయాలని, తద్వారా చరిత్రలో వారి అనుభవాలను భవిష్యత్తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని విశ్లేషించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి సేవల్ని ఆయన ప్రస్తావించారు. దోపిడీ, దారిద్య్రం, అణచివేత ఉన్నంత కాలం వామపక్ష ఉద్యమాలు ఉంటాయని చెప్పారు.