Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన మంత్రి మోడీపై రేవంత్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని నరేంద్రమోడీ భారతదేశాన్ని ఇతర దేశాలతో పోల్చుతూ దేశ భద్రతను ఆగం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ చదువుకోకపోవడంతో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆర్మీవ్యవస్థ ఎలా పని చేస్తుందో కూడా ఆయనకు తెలియదని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఎంపీ నాజర్హుస్సేన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్తో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. దేశసరిహద్దుల్లో బీఎస్ఎఫ్ ఉంటుందనీ, యుద్ధం, శాంతి భద్రతలు, ఆస్తుల పరిరక్షణకు వేర్వేరుగా ఉంటారనీ, ఆర్మీ జవాన్లను యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగిస్తారని గుర్తు చేశారు. నాలుగేండ్లు తర్ఫీదు ఇచ్చి బయటకు వదిలితే ఉద్యోగాలు లేకపోతే వారు ఎటుపోవాలని ప్రశ్నించారు. మిగతా దేశాలలో ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగ భద్రత ఉంటుందని గుర్తు చేశారు. ఇక్కడ మాత్రం ఉద్యోగానికి భరోసా లేదని విమర్శించారు. అగ్నిపథ్, అగ్నివీర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల పరిధిలో సత్యగ్రహ దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ నజర్ హుస్సేన్ మాట్లాడుతూ బీజేపీ సామాన్య జనాలకు వ్యతిరేకమైన బిల్లులు తీసుకువస్తుందని విమర్శించారు. అందులో భాగంగా రైతు చట్టాలు తీసుకు వచ్చిందనీ, తాజాగా అగ్నిపథ్ తీసుకొచ్చిందన్నారు. వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టినట్టుగానే అగ్ని పథ్‌ను వెనక్కి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌కు ఏడాది పూర్తి
రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆదివారంతో ఏడాదికాలం పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 26 చాలా ప్రత్యేకత ఉందన్నారు. 'నన్ను నమ్మి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు నాకు సోనియా గాంధీ అప్పగించారు. తెలంగాణ ప్రజల కోసం కోట్లాడాలి అని నాకు పీసీసీ పదవి ఇచ్చారు. దళిత, గిరిజనులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్నాం' అని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన వివిధ పార్టీ నాయకులు
కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్
బీజేపీ, టీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదివారం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరారు. బీజేపీ నేత బోడ జనార్థన్, రావి శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి దంపతులు, కళ్లెం శంకర్ రెడ్డి, గోపి ముత్యంరెడ్డి తదితరులు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, మెట్పల్లి ఇంచార్జి జువ్వాది నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.