Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రారంభానికి నోచని కొత్త కలెక్టరేట్
- అన్నీ పూర్తయినా అందుబాటులోకి రాని వైనం
- ప్రోటోకాల్ అంశంతోనే ప్రారంభం వాయిదా?
- శిథిలావస్థ కార్యాలయాలతో అధికారులకు ఇబ్బందులు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి 'ముహుర్తం' కుదరడం లేదు. నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు ప్రభుత్వ సేవలు ఒకే దగ్గర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమీకృత కలెక్టర్ కార్యాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కానీ ఇప్పుడు అసలు లక్ష్యం నెరవేరడం లేదు. అయితే 'ప్రొటోకాల్' అంశంతోనే ప్రారంభం వాయిదా పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం కలెక్టరేట్ ప్రారంభానికి రావాల్సి ఉండటంతో వేదిక పంచుకునేందుకు సీఎం సిద్ధంగా లేకపోవడంతోనే ప్రారంభోత్సవం వాయిదా పడుతుందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదని, సీఎం కేసీఆర్ సమయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ప్రజలు ప్రభుత్వ సేవలు పొందేందుకు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ప్రజల సౌకర్యార్థం సేవలన్నీ ఒకే దగ్గర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొత్తం 25 జిల్లాల్లో రూ.1,500 కోట్ల అంచనాతో 2018లో నిర్మాణాలు ప్రారంభించారు. ఒక్కో కలెక్టరేట్ నిర్మాణానికి రూ.50-రూ.60 కోట్లు ఖర్చు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాల్లోనూ నూతన కలెక్టరేట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అనేక తర్జనభర్జనల అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతం ఖానాపూర్ సమీపంలో నూతన కలెక్టరేట్ నిర్మించాలని నిర్ణయించారు. ఇక కామారెడ్డిలో జాతీయ రహదారికి దగ్గరలో నిర్మించాలని నిర్ణయించారు. కామారెడ్డి, నిజామాబాద్ రెండు జిల్లాల్లో కలెక్టరేట్ నిర్మాణాలు శరవేగంగా జరిపారు. రూ.64.2 కోట్ల వ్యయంతో నిర్మించిన కామారెడ్డి కలెక్టర్ కార్యాలయాన్ని గతేడాది జూన్ 20వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కానీ నిజామాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముహుర్తం కుదరడం లేదు.
ప్రారంభం పూర్తయి ఏడాది..
కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయం ప్రారంభించిన సమయంలోనే నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నూతన కలెక్టరేట్‌ను రెండు, మూడు రోజుల్లో ప్రారంభిస్తారని, సీఎం సమయం ఇస్తారని పలుమార్లు ప్రకటించారు. కానీ ప్రారంభం జరగలేదు. ఆ తర్వాత ప్రతిసారీ వాయిదాలు పడుతూ వస్తోంది. దసరా రోజున ప్రారంభిస్తారని, జనవరి మూడాల తర్వాత సీఎం జిల్లాకు వస్తారని ఇలా పలు ప్రచారాలు జరిగాయి. దాదాపు ఏడాది పూర్తయినా ఇప్పటికీ.. నూతన కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభానికి నోచుకోవడం లేదు. గతేడాది డిసెంబర్లో ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సైతం నూతన కలెక్టరేట్‌ను పరిశీలించారు. కార్యాలయ నిర్మాణంపై సంతృప్తి వ్యక్తం చేశారు. హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. ఆ సమయంలోనే సీఎం వస్తారని ప్రచారం జరిగింది. కానీ మళ్లీ వాయిదా పడింది. హుజురాబాద్ ఎన్నికలు, ఎమ్మెల్సీ కోడ్ ఇలా అన్ని కారణాలనూ ముందుకు తెచ్చారు. కానీ కార్యాలయం మాత్రం ప్రారంభం జరగలేదు. దాదాపు రూ.60 కోట్ల వరకు ఖర్చు చేసి నిర్మించిన కార్యాలయం వృథాగా ఉండటంతో ప్రజలకు, ఇటు అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక నూతన కలెక్టరేట్ నిర్మాణం పూర్తవడంతో ప్రస్తుతమున్న కార్యాలయాల్లో మరమ్మతు పనులు అటకెక్కించారు. దాంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వర్షాకాలం రావడంతో ఎప్పుడు ఏ ఆపద వస్తుందోనని భయంభయంగా విధులు నిర్వహిస్తున్నారు.
తెరమీదకు ప్రొటోకాల్ అంశం...
ప్రొటోకాల్ అంశంతోనే కార్యాలయ ప్రారంభం ఆగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీగా బీజేపీకి చెందిన ధర్మపురి అరవింద్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఎంపీ అరవింద్ పలుమార్లు నేరుగా సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఏకవచనంతో సంబోధించడం, తీవ్రమైన ఆరోపణలు గుప్పించడంతో టీఆర్ఎస్కు, ఎంపీగా మధ్య జిల్లాలో కోల్డ్‌వార్ నడుస్తోంది. ఎంపీ కార్యక్రమాలను టీఆర్ఎస్ శ్రేణులు పలుమార్లు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభానికి వచ్చి రసాభాస సృష్టిస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే అంశంతోనూ ప్రారంభం ఆగిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశమై నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డిని వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సమయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.