Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం :
- సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు డీఎల్ కరాద్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్పొరేట్ల లాభాలకు గ్యారెంటీ చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు డీఎల్ కరాద్ అన్నారు. మోడీ సర్కారు కార్మిక హక్కులను కాలరాస్తున్నదనీ, కంపెనీలలో యూనియన్లు లేకుండా చేస్తున్నదని విమర్శించారు. వాటిని తిప్పికొట్టాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీర్, డిస్ట్రిలరీ యూనియన్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో మొత్తం కార్మిక వర్గం పాల్గొనాలని కోరారు. కొత్త మార్పులను కార్మిక వర్గం అర్థం చేసుకునేలా చైతన్యపర్చాలని యూనియన్ల నేతలు శ్రద్ధపెట్టాలని కోరారు. కేవలం స్థానిక సమస్యలపై కృషి చేయడమే కాకుండా యూనియన్ నాయకత్వం కార్మిక వర్గానికి నష్టం చేసే ప్రభుత్వ విధానాలపై కూడా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా యూనిట్లను కలిగి ఉన్న బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న యూనియన్ల మధ్య కోఆర్డినేషన్ పెరిగినప్పుడే యాజమాన్యాలను ఎదుర్కోగలమని కరాద్ నొక్కిచెప్పారు. సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు ఎం. సాయిబాబు మాట్లాడుతూ బీరు, డిస్టిలరీ యూనియన్ల మధ్య సహకారం, సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు జాతీయస్థాయిలో ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి బలోపేతం చేస్తామన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బీరం మల్లేశం, మహారాష్ట్ర సీఐటీయూ నాయకులు అజరు బవాల్కర్, నాగ్నాథ్ బాడే, కర్ణాటక నాయకులు కప్పల్ని గౌడ, కేరళ నాయకులు అశోకన్, తెలంగాణ తెలంగాణ నాయకులు బాగా రెడ్డి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీరు, డిస్టిలరీ పరిశ్రమల యూనియన్ల అఖిల భారత కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్‌గా తెలంగాణకు చెందిన బీరం మల్లేశంను, కో-కన్వీనర్‌గా మహారాష్ట్రకు చెందిన అజరు భవాల్కర్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.