Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గమ్ముగా ఉంటే ఇంట్లో..లేకుంటే జైల్లో...
- ప్రశ్నించే గొంతులపై పాలకుల తీరిది
- కార్పొరేట్ల లాభాల కోసం ప్రజల అణచివేత
- ఎన్కౌంటర్ స్పెషలిస్టుల స్థానంలో భూసేకరణ స్పెషలిస్టులు : నిర్బంధ వ్యతిరేక వేదిక సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో ఇందిరాగాంధీ హయాంలోని ఎమర్జెన్సీ కంటే నేడు తీవ్ర నిర్బంధం ఉందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం మాట్లాడకుండా గమ్ముగా ఉంటే ఇంట్లో ఉండనిస్తున్నారనీ, పొరపాటున ఎవరైనా ప్రశ్నిస్తే తెల్లారేసరికి జైల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ల లాభాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. అప్రకటిత ఎమర్జెన్సీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ నిర్బంధ వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ చీకటి రోజు సందర్భంగా సభ నిర్వహించారు. ఆ వేదిక కన్వీనర్ హరగోపాల్ మాట్లాడుతూ..బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన విద్య, వైద్య రంగాలను ధ్వంసం చేసిందన్నారు. కార్మికవర్గాన్ని కట్టుబానిసలు మార్చి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేందుకుగానూ కార్మిక కోడ్లను అమలు చేయబోతున్నదని చెప్పారు. ప్రజాస్వామ, హక్కుల పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ..ఎమర్జెన్సీ అనుభవాల దృష్ట్యా దానివైపు వెళ్లకుండా సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి సంస్థలను నేటి పాలకులు ప్రయోగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నుంచి భూములను లాక్కుని ఎకరాకు రూ.15 లక్షల పరిహారమిచ్చి తిరిగి అదే భూమిని కార్పొరేట్ సంస్థలకు కోటి రూపాయలకు చొప్పున అమ్ముకుంటూ ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదనీ, దీనికి నిమ్జ్ భూసేకరణే సాక్ష్యమని విమర్శించారు. ఎన్కౌంటర్ల స్పెషలిస్టులు పోయి నేడు భూసేకరణ స్పెషలిస్టులు వచ్చారనీ, బంధువులు, కుటుంబసభ్యులు, గ్రామస్తుల మధ్య వారు చిచ్చుపెట్టి భూములు లాగేసుకుంటున్న తీరును వివరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు ఎక్కడికెళ్లినా ఫోన్ల నిఘా పెట్టడం, అరెస్టు చేయడం పరిపాటిగా మారిందన్నారు. పోలీసులు, అధికారులను ప్రశ్నిస్తే పై నుంచి ఆదేశాలు అంటున్నారనీ, అలాంటప్పుడు ఆ వ్యవస్థలు ఎందుకని ప్రశ్నించారు. వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ..1969 నుంచి ప్రజా ఉద్యమాలపై ఎమర్జెన్సీ తరహాలో ఆంక్షలున్నాయని చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో లక్ష మంది మేధావులు, బుద్ధిజీవులు, నేతలు అరెస్టు అయ్యారనీ, నేడు మోడీ ప్రభుత్వ హయాంలో నాలుగు లక్షల మంది మేధావులు, ఆలోచనాపరులు జైళ్లల్లో మగ్గుతున్నారని వివరించారు. పత్రికా, న్యాయవ్యవస్థలను కూడా మోడీ సర్కారు నిర్వీర్యం చేసిందని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలోనూ పత్రికలు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తమ భావవ్యక్తీకరణను ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, నేడు మీడియాను మోడీ సర్కారు గుప్పిట్లో పెట్టుకుందన్నారు. దేశంలోని 400 ఛానళ్లలో 300కుపైగా అంబానీ, అదానీ, సురేష్‌చంద్ర చేతుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారు చెప్పే భావజాలమే ప్రచారం అవుతున్నదని చెప్పారు. సోషల్‌మీడియా ఎన్ఐఏ నిఘానీడలో నడుస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వీనర్ అంబటి నాగయ్య మాట్లాడుతూ..ఎమర్జెన్సీ లేకపోతే దేశంలో ఆర్ఎస్ఎస్ ఈ స్థాయిలో ఉండేదుకాదనీ, బీజేపీ ఎదుగుదలకు అది ఒక రకంగా దోహదపడిందని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం నాటి స్మృతులను మోడీ సర్కారు నామరూపాల్లేకుండా చేస్తున్నదని విమర్శించారు. నిర్బంధ వ్యతిరేక వేదిక కో-కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ నేత రవిచంద్ర, విమలక్క, సంజయ, తదితరులు పాల్గొన్నారు.