Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రూపాయి పంపితే కేంద్రమిచ్చేది 46 పైసలే
- ఎక్కువ నిధులిచ్చినట్టు రుజువు చేస్తారా?
- దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి: బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్
- వేట కుక్కల్లా దర్యాప్తు సంస్థలు
- ద్రౌపది ముర్మా ఊరికి కరెంటిప్పుడే
- ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్‌కు హాజరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రజలు కేంద్రానికి కట్టిన దానికంటే మోడీ సర్కారు ఎక్కువ నిధులిచ్చినట్టు నిరూపిస్తే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రూపాయి పంపితే 46 పైసలను మాత్రమే విడుదల చేస్తున్న దని విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి ఏ లెక్కన అధిక నిధులిస్తుందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి వస్తున్న బీజేపీ పెద్దలు దమ్ముంటే కేంద్రం నిధుల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయా లని డిమాండ్ చేశారు. పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూ.3,65,797 కోట్లు ఇచ్చిందని నొక్కి చెప్పారు. కేంద్రానికి పన్నుల రూ పంలో అధిక డబ్బులు పంపుతున్న రాష్ట్రాల్లో తెలం గాణ నాలుగో స్థానంలో ఉందని ఆర్బీఐ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు కట్టిన సొమ్మును యూపీ, గుజరాత్లో ఖర్చుపెడు తున్నారని విమర్శిం చారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం పెద్దలు సెల్యూ ట్ చేయాలని సూచించారు. అంతేగానీ, వడ్డీ వ్యాపారుల మాదిరిగా అప్పు లిచ్చినం..కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో పనులు జరుగుతున్నరు అని గొప్పలు చెప్పుకునే ధోరణిని బీజేపీ నేతలు విడనాడాలని హితవు పలికారు. సోమవారం ఢిల్లీలో విపక్షాల రాష్ట్ర పతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, ఇతర పార్టీల నేతలతో కలిసి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సిన్హా తరపున నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీకి అంద జేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం క్యానింగ్లేన్లోని యశ్వంత్ సిన్హా నివాసంలో ఆయన తో భేటీ అయ్యారు. హైదరాబాద్ రావాలని యశ్వంత్ సిన్హాను కేటీఆర్ ఆహ్వానించారు. అంత కు ముందు ఎంపీలతో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశం మేరకు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు సంపూర్ణమద్దతు ప్రకటిం చారు. రాజ్యాంగ స్ఫూర్తికి, పరిరక్షణకు అనుగుణంగా ఆయన పని చేస్తారనే సంపూర్ణ విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లో సిన్హాతో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
దళితుల బతుకులు బాగుపడ్డాయా?
దళితున్ని రాష్ట్రపతి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ గడిచిన ఎనిమిదేండ్లలో దళిత ప్రజల బతుకులను మార్చిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ కాలంలో వారిపై దాడులు మరింత పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు గిరి జన మహిళ రాష్ట్రపతి అయితే గిరిజనుల బతుకులు మారుతాయా? అని ప్రశ్నించారు. ద్రౌపది ముర్ము గ్రామానికి ఇప్పటి వరకూ విద్యుత్ సౌకర్యం లేదని గుర్తుచేశారు. నేటికీ గుజరాత్‌లోని చాలా గ్రామాలకు కరెంటు సౌకర్యం లేదని చెప్పారు. ఒడిశాలోని కళింగనగర్‌లో ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గిరిజనులపై పోలీసులు కాల్పులు జరిపితే 13 మంది చనిపోయారనీ, ఆ ఘటనను ఖండిస్తూ అప్పుడు మంత్రిగా ఉన్న ద్రౌపది ముర్ము చిన్న ప్రకటన కూడా చేయలేదని గుర్తుచేశారు. ద్రౌపది ముర్ము వ్యక్తిగతంగా మంచి వ్యక్తే కావచ్చు అంతమాత్రాన ఆమెను అభ్యర్థిత్వాన్ని సమర్ధించలే మన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం కేంద్రం ఏం పథకాలను అమలు చేస్తున్నదని ప్రశ్నించారు. అభివృద్ధిని విస్మరించి హిందూ- ముస్లిం, పాకిస్థాన్-బంగ్లాదేశ్, హలాల్, హిజాబ్ పేర్లతో ప్రజల్లో విషం నింపడం తప్ప బీజేపీ నేతల దగ్గర ఇంకేం లేదని విమర్శించారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు మోడీ రాసిన రాజ్యాంగం అమలవుతున్నదని ఆందోళన వెలిబుచ్చారు. బీజేపీ నియంతృత్వ, నిరం కుశ, అప్రజాస్వామిక పాలనను నిరసిస్తూనే ఆ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తు న్నామని చెప్పారు. ప్రతిపక్షాల కూటమిలో తాము లేమనీ, శరద్‌పవార్, మమతాబెనర్జీ విజ్ఞప్తి మేరకు సిన్హాకు మద్దతిస్తు న్నామని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి
గిరిజనులపై నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను పెంచాలనీ, ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏపీలో బలవంతంగా కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని కోరారు. విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యా రం స్టీల్ ప్లాంట్ ఏమైందని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారా? ఐటీఐఆర్ అమలు చేశారా? నవోదయ పాఠశాల, ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కాలేజ్, ఎన్ఐడీ, రైల్వే లైన్ల కేటాయింపులో అన్యా యం చేసిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందన్నారు. కానీ, కేంద్రం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేకపోయిం దన్నారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హౌదా కల్పించినా... అది పూర్తి కాలేదని గుర్తు చేశారు. 'సాలు దొర.. సెలవు దొర' బీజేపీ క్యాంపెయిన్‌పై స్పందిస్తూ భావ దారిద్రానికి, చిల్లర రాజకీయాలకు నిదర్శనమని విమ ర్శించారు. కేసీఆర్ బొమ్మ పెట్టకపోతే... తెలంగాణలో బీజేపీ పార్టీ నడిచే పరిస్థితి లేదనీ, ఆ పార్టీ వైపు తొంగి చూసేవారు కూడా ఉండరని తెలిపారు.
జుమ్లా లేదంటే హమ్లా
దేశ ఆర్థిక ఆర్థిక పరిస్థితిని మోడీ సర్కారు దివాళా తీయించడంతో 30 ఏండ్లలోనే నేడు అత్యధిక ద్రవ్యోల్బణం నెలకొందని కేటీఆర్ విమర్శిం చారు. 45 ఏండ్ల గరిష్టానికి నిరుద్యోగ రేటు చేరిందని తెలిపారు. బీజేపీ తీరు జుమ్లా లేదంటే హమ్లాగా ఉందన్నారు. సీబీఐ, ఐటీ, ఈడీ దర్యాప్తు సంస్థలను వేటకుక్కల్లా ఉసిగొల్పి దాడులకు పాల్ప డుతున్నదని విమర్శించారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ కూలదోస్తే... ప్రజలు తిరగబడి మళ్లీ అధికారంలోకి తెచ్చుకున్నారని గుర్తుచేశారు. బీజేపీకీ అలాంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుందన్నారు. ఆ ధిక్కార స్వరం తెలంగాణ నుంచో, కేసీఆర్ రూపంలోనే దేశం మొత్తాన్ని చైతన్య పరుచవచ్చన్నారు. మెజార్టీ లేకపోయినా దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తల కిందులు చేసి అధికారం చేజిక్కించుకుందని ఆరో పించారు. ప్రజాస్వామాన్ని నమ్మే ఏపార్టీ అయినా ఈ విధానాన్ని తిరస్కరించాలని కోరారు.