Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతి భవన్‌కు వెళ్తున్న గిరిజనులకు పోలీసులకు మధ్య తోపులాట
- అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో
నవతెలంగాణ-అశ్వారావుపేట
తమ దీర్ఘకాలిక అపరిష్కృతంగా ఉన్న పోడు సాగు భూములకు పట్టాలివ్వాలని, ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకున్న తమ పట్టా భూములను తమకు ఇవ్వాలని కోరుతూ నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామ గిరిజనులు ప్రగతిభవన్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం రామన్నగూడెంలో సమావేశం అయి, అధికార పార్టీ జెండాలు, ఫ్లెక్స్‌లు పట్టుకొని బయలుదేరారు. దాంతో గ్రామం సరిహద్దుల్లో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నం అవుతుందని, ఎమ్మెల్యే, కలెక్టర్ మీ సమస్యలు గురించి మాట్లాడుతున్నారని సీఐ బాలకృష్ణ వివరిస్తూ నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా గిరిజనులు వినకుండా ముందుకు కదలడానికి ప్రయత్నించగా పోలీసులు, గిరిజనుల మధ్య తీవ్ర వాగ్వివాదంతో పాటు తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటుతుండటంతో గిరిజనులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా పాదయాత్రను భగం చేయడానికి నాయకత్వం వహిస్తున్న సర్పంచ్ స్వరూప, మడకం నాగేశ్వరరావులను ముందస్తు అరెస్టు చేయడానికి ఆదివారం పోలీసులు రామన్నగూడెం వెళ్లగా మడకం నాగేశ్వరరావు తప్పించుకున్నారు. సర్పంచ్ స్వరూపతోపాటు మరి కొందరు గ్రామస్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కారానికి 13 ఏండ్లుగా వేచి ఉన్నామని, కానీ హామీలకే పరిమితమవుతున్నాయని, అందుకే నేరుగా తమ సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకొందామని, శాంతియుతంగా బయలుదేరినట్టు తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీపీ చెప్పినట్టు విననందునే ఇలా నిర్భంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.