Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుర్చీ దొరకడం లేదా..
- ఎర్రజెండా వల్లే.. అటవీ హక్కు చట్టం వచ్చింది : ఆదివాసీ గిరిజన ధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- భుజం భుజం కలిపి పోరాడుదామని పిలుపు
నవతెలంగాణ-హాజీపూర్
కుర్చీ వేసుకుని కూర్చుని గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలిస్తామన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి కుర్చీ దొరకడం లేదా అని ఎద్దేవా చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా చేపట్టిన పోడు ధర్నాలో తమ్మినేని మాట్లాడారు. ఎర్రజెండా ఎంపీల పోరాటంతో 2006లో పార్లమెంట్లో అటవీ హక్కుల చట్టం, పనికి ఆహార పథకాలు అమలుకు నోచుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం మరిచిపోయి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. పేదల అనుకూల చట్టాలను మార్చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కు చట్టం ప్రకారం పోడు సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లోకి అటవీ, పోలీసు అధికారులు వెళ్లే వీల్లేదని చెప్పారు. కానీ, నిరంకుశ ప్రభుత్వాల అండదండలతో అధికారులు పేద రైతులపై దాడులకు పాల్పడుతూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో.. పోడు రైతులకు తానే స్వయంగా కుర్చీ వేసుకొని హక్కు పత్రాలు ఇస్తానన్న హామీని విస్మరించారని అన్నారు. హక్కు పత్రాల కోసం నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారని చెప్పారు. చట్టం ప్రకారం శాటిలైట్ సర్వే చెల్లదని, 2006 అటవీ హక్కు చట్టం ప్రకారం పోడు భూములపై విచారణ చేసే అధికారం కానీ, గుర్తించే అధికారం కానీ సీఎంకు కూడా లేదని తెలిపారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీకి(ఎఫ్ఆర్సీ) మాత్రమే ఆ నిర్ణయాధికారం ఉంటుందన్నారు. ప్రాణం పోయినా భూములు వదులుకునేది లేదని, భుజం భుజం కలిపి ఉద్యమంలో పాలుపంచుకోవాలని పోడు రైతులకు పిలుపునిచ్చారు. పోడు రైతుల పక్షాన పోరాడేందుకు సీపీఐ(ఎం) నిరంతరం ముందంజలో ఉంటుందని చెప్పారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బండారు రవికుమార్ మాట్లాడుతూ.. బుక్కెడు బువ్వను అందించే భూమి కోసం పోరాడుతున్న ఆదివాసీ గిరిజనులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు బనాయించి జైళ్లకు పంపడం సరికాదన్నారు.
తాత, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని, కందకాలు తవ్వి మొక్కలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పోడు సాగు చేసుకుంటున్న రైతులందరికీ తక్షణమే హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు మంచిర్యాల జిల్లాలోని 16 మండలాల నుంచి ఆదివాసీ గిరిజనులు పెద్దఎత్తున తరలివచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశన్న, జిల్లా కార్యదర్శి సంకె రవి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పున్నం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరం అశోక్, సీపీఐ(ఎం), గిరిజన, వ్యవసాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.