Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి(మంగళవారం నాడు)ని పురస్కరించుకుని ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళి అర్పించారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. క్లిష్ట సమయంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. పీవీ సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని గుర్తుచేశారు. వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ స్ఫూర్తి తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పివీ నిరూపించారని కొనియాడారు. పీవీ స్ఫూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.