Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీఎంకు వినతి పత్రం అందజేసిన చీఫ్ విప్ వినరుభాస్కర్, ఎంపీ పి.దయాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇటీవల రైల్వే శాఖ ఆటో స్టాండ్లకు విధించిన టాక్స్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ సోమవారం హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో డివిజనల్ జనరల్ మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పార్కింగ్ విషయంలో రైల్వే అధికారులు ఆటో డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని డీజీఎం దృష్టికి వారు తీసుకెళ్లారు. పొట్టకూటి కోసం వేలాది మంది కార్మికులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారనీ, రోజంతా ఆటో నడిపినా వారు సంపాదించేది నామమాత్రమేనని తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో రైల్వే స్టేషన్ల వద్ద ఆటోలు పార్క్ చేసినందుకుగానూ టాక్స్ విధించడం దారుణమన్నారు. ఆటో యూనియన్ విజ్ఞప్తి విషయంలో స్పందించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని రైల్వే డీజీఎంను కోరారు. అన్ని రైల్వే స్టేషన్లలో ఆటో స్టాండ్ల వద్ద టెండర్ల వ్యవస్థను రద్దు చేయాలనే విజ్ఞప్తికి డీజీఎం సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మెన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, ప్రతాపరుద్ర ఆటో యూనియన్ బాధ్యులు పాల్గొన్నారు.