Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలను పరిశీలించిన రాష్ట్ర అసిస్టెంట్ సెక్రెటరీ
నవ తెలంగాణ- సిద్దిపేట
కలుషిత ఆహారం తిని 128మంది విద్యార్థినులు అస్వస్ధతకు గురయ్యారు. వారిలో 15మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సిద్దిపేటలోని ప్రభుత్వ గురుకుల మైనార్టీ బాలికల పాఠశాలలో జరిగింది. పాఠశాలలో మొత్తం 326మంది విద్యార్థినులు చదువుతున్నారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం విద్యార్థినీలకు చికెన్‌తో భోజనం వడ్డించారు. రాత్రి మోనులో వంకాయ కూర వండగా, మధ్యాహ్నం మిగిలిన చికెన్ గ్రేవీని వంకాయ కూరతో కలిపి రాత్రి వడ్డించారు. దాంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యార్థినులకు వాంతులు, విరోచనాలతో సోమవారం ఉదయం వరకు సుమారు 128 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిర్వాహకులు స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన చేరుకొని విద్యార్థినీలకు హాస్టల్లోనే వైద్య సేవలు అందించారు. కాగా, వారిలో 15మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి కాశినాథ్ను ఆదేశించారు. విద్యార్థినులు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు వైద్యులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న మైనార్టీ గురుకుల పాఠశాలల రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ఎండీ యూసుఫ్ అలీ, జిల్లా డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు సోమవారం పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భోజనశాలను పరిశీలించారు.