Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ ఘటనలో ఆర్మీ అభ్యర్థులపై కేసులు అన్యాయం
- అగ్నిపథ్‌ను రద్దు చేసేవరకు కాంగ్రెస్ పోరాటం: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-మల్కాజిగిరి
ఆర్మీలో చేరి, దేశానికి సేవలందించాలనుకున్న యువకులు నేరస్థులెలా అవుతారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దేశం మీద ప్రేమతో నిరసన తెలిపేందుకు వచ్చిన సందర్భంగా జరిగిన సికింద్రాబాద్ ఘటన ఆధారంగా యువకులను నేరగాళ్లుగా చిత్రీస్తారా?.. అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఘటనకు అగ్నిపథ్ స్కీంను తెచ్చినోళ్లు బాధ్యులా? స్కీం వద్దని ఆవేదన వ్యక్తం చేసినోళ్లు బాధ్యులా? ఈ విషయంలో సీఎం కేసీఆర్ వైఖరి ఏమిటి? అని ప్రశ్నించారు. అగ్నిపథ్ స్కీంను రద్దు చేయాలని కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అధ్యక్షతన సోమవారం మల్కాజిగిరి చౌరస్తాలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించుకుని, దేశ యువతకు క్షమాపణలు చెప్పేవరకు కాంగ్రెస్‌పార్టీ కొట్లాడుతూనే ఉంటుందన్నారు. దేశాన్ని కాపాడాలనుకున్న యువతను నేరగాళ్లుగా ముద్రవేసి, వారు భవిష్యత్తులో ఇతర ఉద్యోగాలకు పనికి రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ విషయంలో కేసీఆర్ తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలన్నారు. 'అగ్నిపథ్ వద్దన్న పాపానికి పిల్లలను చర్లపల్లి జైల్లో బంధించారు. ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎట్లుంటదో ఆలోచన చేయండి. ఏ తల్లిని కదిలించినా, జైల్లో ఉన్నవారి కుటుంబాలను కదిలించినా కన్నీటి గాథలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించి తక్షణమే యువకులపై కేసులను ఉపసంహరించుకోవాలి' డిమాండ్ చేశారు. తెలంగాణ యువకుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని టీఆర్ఎస్ ఎంపీలు మోడీకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు.''జైల్లో ఉన్న యువత తల్లిదండ్రులకు మాట ఇస్తున్న.. మీ బిడ్డగా చెబుతున్న.. ఈ రాష్ట్రం గొడ్డుబోలే.. మానవత్వం సచ్చిపోలే.. మనుషులుగా మేము బతికే ఉన్నం. రాజకీయంగా మీరు మీ ఇష్టం వచ్చిన వారికి ఓట్లు వేసుకోండి, కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ వెంట ఉంటాం. సికింద్రాబాద్ ఘనటలో ఆరోపణలున్న పిల్లలందరి కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది'' అని చెప్పారు.
ఆ పిల్లల బెయిల్ కోసం లాయర్లను నియమించి, పూచీకత్తులను చెల్లించి, వారికోసం కొట్లాడతామన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకొనే వరకు ఏ విధంగా పోరాడామో, అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించుకునేదాకా అలాగే పోరాడుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో, కేంద్రంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలకు ఈడీ నోటీసులు ఇప్పించడం.. ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారని విమర్శించారు. విపరీతంగా పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరల గురించి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న నరేంద్ర మోడీ.. ఆ ఉద్యోగాలెక్కడీ ఎనిమిదేండ్ల కాలంలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.