Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేషన్ కార్డు, పింఛన్ ఇంకెప్పుడిస్తారు?
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- తహసీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా
నవతెలంగాణ -రామన్నపేట
ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల వ్యతలు తీరడం లేదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు పింఛన్, రేషన్ కార్డు, దళితబంధు, ఇంటి నిర్మాణానికి రుణ సాయం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట తహసీల్థార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజలు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలాగే మిగిలిపోయాయి తప్ప అమలుకు నోచుకోలేదన్నారు. రేషన్ కార్డు కోసం ఏండ్ల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఎర్పడిందన్నారు. పింఛన్ల కోసం వృద్ధ్దులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఎదురు చూస్తుంటే.. రేపు మాపు అంటూ పాలకులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. భర్త చనిపోతే వెంటనే ఆయన పింఛన్ తీసేస్తారు కానీ అదేవిధంగా భార్యకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఐదెకరాల భూమి ఉంటే పింఛన్ తొలగిస్తున్నారన్నారు. వందల ఎకరాలున్న వారికి రైతుబంధు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం, మూడెకరాల భూమి అంటూ మోసం చేసి, ఇప్పుడు ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు, పది లక్షల దళితబంధు అంటూ ఆశలు పెడుతూ అవి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. అనంతరం డిప్యుటి తహసీల్దార్, ఎంపీడీఓకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి, నాయకులు జల్లెల పెణటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, వనం ఉపేందర్, కూరెళ్ళ నరసింహాచారి, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.