Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జక్కలొద్దిలో పోలీసులకు ఎదురు వెళ్లి గుడిసెలు వేసుకున్న పేదలు
- ఆదివారం రాత్రి మరోసారి పోలీసుల దాడి
- పేదోడి మనోబలం ముందు పెద్దోడి పెత్తనం చెల్లదని నిరూపణ
నవతెలంగాణ-మట్టెవాడ
బుల్లోజర్లతో గుడిసెలు తొలగించినా పేదలు వెనక్కి తగ్గకుండా మళ్లీ అక్కడే గుడిసెలు వేసుకొన్నారు. వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం జక్కలొద్దిలోని ప్రభుత్వ స్థలంలో పోలీసుల దౌర్జన్యాలు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలను ఎదురొడ్డి పేద ప్రజలు సోమవారం మళ్లీ గుడిసెలు వేసుకున్నారు. జక్కలొద్ది ప్రభుత్వ స్థలంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న గుడిసెలను జూన్ 8న ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు బుల్డోజర్లను రంగంలోకి దించి పేదలను దౌర్జన్యంగా కొట్టి గుడిసెలను తగలబెట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి పేద గుడిసెవాసులకు, పోలీసులకు నిత్యం రణరంగం జరుగుతూనే ఉంది. పోలీసులు ఎన్ని విధాలా దౌర్జన్యాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా పేదలు వెనక్కి తగ్గకుండా జక్కలొద్ది భూమిలోనే తలదాచుకుంటున్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఇండ్ల స్థలాల భూమి దక్కే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ప్రభుత్వభూమిలో గుడిసెలు వేసుకుంటూ వస్తున్నారు. గుడిసెవాసులపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రతిపక్ష పార్టీలు ప్రతిరోజూ గుడిసె వాసులను కలుస్తూ సంఘీభావం తెలుపుతూ వారి పోరాటానికి మద్దతు ఇవ్వడంతో వారిలో మనోధైర్యం పెరిగింది. సీపీఐ(ఎం) అండగా ఉంటే ఏదైనా సాధించగలం అనే ధైర్యం ఉందని.. వారి నాయకత్వంలో పోరాడి గుడిసె స్థలాలను సాధించుకుంటామని గుడిసె వాసులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మరింతమంది గుడిసెలు వేసుకున్నారు. అయితే, సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం రాత్రి అక్కడికి చేరుకుని గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించారు. వారిని గుడిసెవాసులు తీవ్రంగా ప్రతిఘటించారు. కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రెచ్చిపోయి లాఠీచార్జి చేసినా, వెహికల్స్ గాలి తీసేసినా, ఆటో అద్దాలు, కుర్చీలు పగలగొట్టారు. పోలీసులు ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా గుడిసెవాసులు వెనుదిరగలేదు. చివరికి అప్పటికప్పుడు తొలగించిన కొన్ని గుడిసెలను మళ్లీ వేసుకోవడం గమనార్హం.
పోలీసుల దాడికి ఖండన
జక్కలొద్దిలో గుడిసెలు వేసుకుంటున్న పేదలపై పోలీసులు దాడి చేయడాన్ని సీపీఐ(ఎం) కేంద్ర కంట్రోల్కమిషన్ సభ్యుడు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సబ్యుడు జి.నాగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు కబ్జాదారులకు వంతపాడుతూ పేదలను ఖాళీ చేయించే ప్రయత్నం చేయడం దుర్మార్గం అని అన్నారు. పేదలపై ఎలాంటి దాడి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.