Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర నేతలు అజీజ్ పాషా, స్కైలాబ్ బాబు
- ఘట్కేసర్లో మతాంతర వివాహం నిర్వహణ
నవతెలంగాణ-ఘట్కేసర్
కుల, మతాంతర ఆదర్శ వివాహాలను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ప్రోత్సహించాలని సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు అజీజ్‌పాషా, టి.స్కైలాబ్ బాబు చెప్పారు. సోమవారం సీపీఐ(ఎం), సీపీఐ సంయుక్త ఆధ్వర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ కేవీఆర్ ఫంక్షన్ హాల్లో షేక్ సర్వర్ పాషా-సురేఖ ఆదర్శ వివాహం జరిగింది. సీపీఐ(ఎం), సీపీఐ మండల కార్యదర్శులు ఎన్.సబిత, లొట్టి ఈశ్వర్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్ బాబు వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. వధూవరులు ప్రమాణ పత్రాలు చదివి సంతకాలు చేసి పూలదండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా అజీజ్‌పాషా, స్కైలాబ్ బాబు మాట్లాడారు. పెండ్లి చేసుకోవడానికి కుల, మతాలు అవసరం లేదని, మేజర్లు అయి ఉండాలని అన్నారు. కులం కన్నా గుణం గొప్పదని, మతం కన్నా మానవత్వం గొప్పదని గుర్తుంచుకోవాలన్నారు. కుల, మతాలకతీతంగా ఆదర్శ వివాహాలు జరిపించాలన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే ఎక్కువగా కుల మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. నేటి యువతరం ఆ బాటలో పయనించాలన్నారు. ఈ వివాహ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటిరవి, చింతల యాదయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి సాయిలుగౌడ్, జయచంద్ర, టీఆర్ఎస్ నాయకులు ముజీబ్, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సృజన, వినోద, కేవీపీఎస్ జిల్లా నాయకులు ఎన్.బాలు గుంటి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.