Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో అవకాశం కొనసాగించాలి
- కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ధర్నా
నవతెలంగాణ-కరీంనగర్
గిరిజన బెస్ట్ అవలబుల్ విద్యార్థులకు గతంలో ఉన్న స్కూల్లోనే విద్యాభ్యాసం, వసతి గృహం కొనసాగించి.. వారికి న్యాయం చేయాలని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, తిరుపతి మాట్లాడారు. గతంలో బెస్ట్ అవలబుల్ సీట్ల కింద గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి కొన్ని ప్రయివేటు పాఠశాలలు, సెంట్ జాన్స్, సెంట్ ఆంటోని పాఠశాలల్లో సీట్లు భర్తీ చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యాలు తమకు వచ్చే రూ.30వేలు సరిపోవడం లేదని, గిరిజన విద్యార్థులకు స్కూళ్లల్లో అడ్మిషన్ ఇవ్వబోమని కలెక్టర్, గిరిజన సంక్షేమ అధికారికి రాతపూర్వకంగా చెప్పాయని తెలిపారు. కలెక్టర్, స్థానిక మంత్రి తక్షణమే స్పందించి గతంలో ఉన్న స్కూల్ విద్యాభ్యాసం, వసతి గృహం కొనసాగేలా చూడాలని కోరారు. గతంలో విద్యార్థులను చేర్చుకొని,ఇప్పుడు వద్దని చెబుతున్న సెయింట్ ఆంటోనీ, సెయింట్ జాన్స్ స్కూల్స్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులకు ప్రయివేటు,కార్పొరేట్ స్కూళ్లలో 25శాతం ఉచిత విద్యాభ్యాసం కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దన్నారు. ఈ ధర్నాలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరేష్ పటేల్, లంబాడి ఐక్యవేదిక రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు నరేష్ నాయక్, డీవైఎఫ్ఐ నాయకులు అజయ్, వినోద్, సురేష్, రఘు, శ్రీనివాస్, కీర్తన తదితరులు పాల్గొన్నారు.