Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ గోపి
నవతెలంగాణ-ఖానాపురం
అగ్నిపథ్ నిరసనల్లో మృతిచెందిన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబీర్పేటలో దామెర రాకేశ్ సంస్మరణ సభలో రాకేశ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం నియామక పత్రాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేశ్, జిల్లా కలెక్టర్ గోపి రాకేశ్ కుటుంబ సభ్యులకు అందచేశారు. అనంతరం వెంటనే అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని అందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అగ్నిపథ్ ధర్నా విషయంలో విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. సంస్మరణ సభలో రాకేశ్ ఆత్మశాంతికి మౌనం పాటించారు. అంతకుముందు రాకేశ్ ఇంటికి వెళ్ళి రాకేశ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ దేశం కోసం రాకేశ్ అంకితమయ్యాడు. రాకేశ్ ఆత్మ బలిదానం వృథా కాదని, సైనికుల్లో చేరాలనే కాంక్షతో దేశభక్తికి స్ఫూర్తిగా నిలిచాడన్నారు. కానీ ఇంత జరిగినా రాకేశ్ కుటుంబాన్ని కేంద్రం ఆదుకోలేదని, సీఎం కేసీర్ మానవతా దృక్పథంతో ఆదుకున్నారని తెలిపారు. వాళ్ళ ఇంట్లో ఒకరికి రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చారని చెప్పారు. దబీర్పేటను తాను దత్తత తీసుకుంటున్నాని, గ్రామ అభివృద్ధి తన బాధ్యతని తెలిపారు. గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నామని, కీర్యా తండాకు రూ. 20 లక్షలు మంజూరు. దళిత బంధు, ఇండ్లు వంటి ఏ పథకాలు వచ్చినా దబీర్‌పేటకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మెన్ రామస్వామి నాయక్, ఆర్డీవో పవన్ కుమార్, డీపీఆర్వో పల్లవి, వివిధ శాఖల అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.