Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయాన్ మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయిస్తారు. అయితే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు రాజ్‌భవన్‌కు వస్తారని సమాచారం. ఆయనతోపాటు న్యాయశాఖ మంత్రి, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. అస్సోంకు చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ హైకోర్టులో న్యాయమూర్తిగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రమోషన్‌తో ఇక్కడే సీజే కాబోతున్నారు. ఇప్పటి వరకు చీఫ్ జస్టిస్‌గా చేసిన జస్టిస్ సతీష్‌చంద్రశర్మను దిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. జస్టిస్ భూయాన్ 1964 ఆగస్టు రెండున గౌహతిలో జన్మించారు. అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదివాక ఢిల్లీలో డిగ్రీ చేశారు. గౌహతిలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చేశారు. 1991 మే 20న గౌహతిలో లాయర్‌గా ఎన్రోల్ అయ్యారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వ న్యాయవాదిగా, అదనపు అడ్వకేట్ జనరల్‌గా చేశారు. 2010లో సీనియర్ అడ్వకేట్ అయ్యారు. 2011 అక్టోబర్ 17న గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబర్ మూడు నుంచి ముంబై హైకోర్టుకు బదిలీ అయ్యారు. రెండేండ్లు చేశాక గతేడాది అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. అక్కడ హైకోర్టులో 2019 జనవరి ఒకటిన ఏర్పాటైన తర్వాత మూడున్నర ఏండ్లలో జస్టిస్ భూయాన్ ఐదో సీజే అవుతారు.
సుజనాకు ఊరట
బ్యాంకులకు రుణాలు చెల్లించలేదని సీబీఐ నమోదు చేసిన కేసు విచారణ నిమిత్తం లుక్ఔట్ నోటీసు ఉన్నం దున అమెరికా వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ సుజనాచౌదరి చేసిన వినతికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. లుక్ఔట్ నోటీసు ఎంత కాలం వినియోగంలో ఉంటుందో చెప్పాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 30 నుంచి ఆగస్టు 14 వరకు సుజనా అమెరికా ఇతర దేశాల పర్యటనకు అనుమతి ఇచ్చింది. విచారణను వాయిదా వేసింది.
ఆ భూములపై సర్వేకు ఆదేశం
రంగారెడ్డి జిల్లా మియాపూర్ సర్వే నెంబర్ 159, 28/1, 20లోని 380 ఎకరాల భూమిని సర్వే చేసి అందులో ఖాళీ స్థలాలను గుర్తించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. వేలం కోసం హెచ్ఎండీఏ 2018 మార్చిలో నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మయూరి నగర్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో సవాలు చేసిన కేసులో ఇటీవల తీర్పు వెలువరించింది. సొసైటీ సవాల్ చేసిన రిట్లలో హుడా 380 ఎకరాలను ఇండ్ల స్థలాలుగా చేసి చాలా ఏండ్ల క్రితం అమ్మిందనీ, పార్కులు, పోలీస్ స్టేషన్, కమ్యూనిటీ హాల్, హెల్త్ , బస్టాప్ వంటి వాటికి కేటాయించిన స్థలాలను వేలం వేయడాన్ని తప్పుపట్టింది. చట్ట ప్రకారం 10 శాతం ఖాళీ స్థలాలు ఉండాలనే నిబంధనకు వ్యతిరేకంగా చేస్తోందని చెప్పింది. 13.75 శాతం ఖాళీ స్థలం ఉందని హెచ్ఎండీఏ వివరించింది. సర్వే చేసి 10 శాతం కంటే ఎక్కువగా భూమిని హుడా వదిలి ఉంటే వాటిని మాత్రమే అమ్ముకునే హక్కు ఉందని హైకోర్టు తేల్చింది.