Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు రేవంత్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్, మోడీని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రాల్లో కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని చెప్పారు. రైతులు గిట్టుబాటు ధర ఇవ్వలేదని నిలదీస్తే కేసులు పెట్టి బేడీలు వేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పలువురు ఇతర పార్టీల నేతలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరిగితే తిరగబడ్డ ప్రాంతం ఖమ్మమనీ, మిర్చిపంట నష్టపోతే కనీసం పరిహారం కూడా ఇవ్వలేదని విమర్శించారు. వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకు ఏకకాలంలో రెండు లక్షల మాఫీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 22 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా...సీఎం ఆ కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. మంత్రి పువ్వాడ అజరుపై పోరాటం చేస్తున్న విద్యార్థులపై కేసులు పెట్టారనీ, ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ఆ మంత్రిని బర్తరఫ్ చేయాల్సింది పోయి దగ్గరకు తీసుకున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తేనే రైతులకు న్యాయం జరుగుతున్నదనీ, భూవివాదాలకు ధరణి కారణమన్నారు. అధికారంలోకి వస్తే దాన్ని రద్దుచేస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదన్న రేవంత్... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. సైన్యంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా నియామకాలు చేపట్టలేదనీ, రాత పరీక్షలనూ రద్దు చేశారని మండిపడ్డారు. పైగా నాలుగేండ్ల ఔట్సోర్సింగ్ తీసుకొచ్చారన్నారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఆందోళనకారులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ పోడుభూములు సాగు చేసుకుంటున్న మహిళలపై పోలీసుల దాడులు సమంజసం కాదన్నారు. పోడు భూముల సమస్య తీరుస్తానన్న సీఎం కేసీఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు. గిరిజన మహిళపై దాడులు చేసి సమస్యను పెండింగ్ పెడుతున్నారని విమర్శించారు. ఖమ్మం మాజీ కార్పొరేటర్ రాంమూర్తి నాయక్, మాజీ జడ్పీటీసీ భారతి పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీపీసీసీ ఎన్నారై విభాగం గల్ఫ్ కన్వీనర్‌గా నరేష్‌రెడ్డి
జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డిని టీపీసీసీ ఎన్నారై విభాగం గల్ఫ్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. కాంగ్రెస్‌పార్టీ ప్రవాస భారతీయుల విభాగం చైర్మెన్ డాక్టర్ బిఎం.వినోద్‌కుమార్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.