Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే లైన్ కోసం రూ.600 కోట్లు ఖర్చు పెట్టాం
- 2,200 ఎకరాల భూసేకరణ చేశాం : మంత్రులు హరీశ్‌రావు,నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ-గజ్వేల్
రైల్వే రాక్‌పాయింట్ కోసం దశాబ్దాల కాలం పోరాటం చేశామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా సీఎం కేసీఆర్ పని చేసినప్పటి నుంచి గజ్వేల్‌కు రైల్వేలైన్ కోసం పోరాటం సాగించినట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గూడ్స్ రైలు ద్వారా ఎరువులు తెచ్చారు. సోమవారం గజ్వేల్‌లో మంత్రులు రైల్వే రాక్పాయింట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎఫ్‌సీఎల్ నుంచి 21 బోగీల్లో గజ్వేల్‌కు 1,300 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కార్మిక మంత్రిగా పని చేసి కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలైన్‌కు నిధులు మంజూరు చేయాలని అనేకసార్లు పోరాటం చేశారని గుర్తు చేశారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.600 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 2,200 ఎకరాల భూసేకరణ చేశామన్నారు. రైతులకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే విధంగా రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయన్నారు. రైతులు పత్తి, పప్పుదినుసులు, ఆయిల్‌పామ్ సాగు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. దేశంలోని జాతీయ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే గజ్వేల్ అభివృద్ధి జరిగేది కాదన్నారు. వరంగల్‌కు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ తరలించుకుపోతే ఇక్కడి నాయకులకు సోయి లేదన్నారు. ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతి తీసుకొచ్చి యువకుల ఉసురు పోసుకుంటోందన్నారు. ఒకటి రెండు రోజుల్లో రూ.7,500 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో పడతాయన్నారు. అనంతరం గజ్వేల్ సమీకృత భవనంలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఫారూక్ హుస్సేన్, జిల్లా పరిషత్ చైర్మెన్ రోజా శర్మ, ఎఫ్డీసీ చైర్మెన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ ఎలక్షన్ రెడ్డి, జిల్లా సహకార బ్యాంకు చైర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మెన్ నేతి చిన్న రాజమౌళి, వైస్ చైర్మెన్ జాకీర్, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మల్లేశం, గజ్వేల్ స్పెషల్ అధికారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.