Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటర్ ఫలితాల్లో బాలికల పైచేయి
- ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత
- అగ్రస్థానంలో మేడ్చల్, అట్టడుగున మెదక్
- ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- జులై 6 వరకు ఫీజు చెల్లింపు గడువు
- రేపటి నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులు: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక ఫలితాలను మంగళవారం హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డులో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో రెండేండ్ల తర్వాత పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ వారే పైచేయి సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,64,892 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,94,378 (63.32 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,33,210 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,68,692 (72.33 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,31,682 మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 1,25,686 (54.25 శాతం) మంది పాసయ్యారు. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు 18.08 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 4,42,895 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,97,458 (67.16 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,19,271 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 1,65,060 (75.28 శాతం) మంది ఉతీర్ణత సాధించారు. 2,23,624 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 1,32,398 (59.21 శాతం) మంది పాసయ్యారు. అంటే ద్వితీయ సంవత్సరంలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలు 16.07 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత పొందడం గమనార్హం. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, ఓఎస్డీ సుశీల్‌కుమార్, సీవోఈ అబ్దుల్ ఖాలిక్, జేడీ ఓబిలి రాణి, సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే తదితరులు పాల్గొన్నారు.
సెకండియర్‌లో తగ్గిన ఉత్తీర్ణత
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత 2020 వార్షిక ఫలితాలతో పోలిస్తే తగ్గింది. అంటే గతేడాది (2021) వార్షిక పరీక్షలను నిర్వహించకుండానే ద్వితీయ సంవత్సరం విద్యార్థులందర్నీ ప్రభుత్వం పాస్ చేసింది. 2022 ఫలితాల్లో ఇంటర్ సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2020 ఫలితాల్లో 68.86 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. అంటే 2020తో పోలిస్తే 2022లో 1.7 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఇక ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రస్తుతం (2022) 63.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2020లో 60.01 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. అంటే అప్పటి కంటే ప్రస్తుతం 3.31 శాతం ఉత్తీర్ణత పెరగడం గమనార్హం.
రేపటినుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు ప్రారంభం
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తేదీ వరకు జరుగుతాయి. జులై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు. అయితే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గురువారం నుంచి ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. ఈ గడువు వచ్చేనెల ఆరో తేదీ వరకు ఉందని స్పష్టం చేశారు. గురువారం నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
దరఖాస్తు చేసేందుకు తుది గడువు వచ్చేనెల ఆరో తేదీ వరకు ఉన్నది. రీకౌంటింగ్ కోసం ప్రతి పేపర్‌కూ రూ.100, రీవెరిఫికేషన్ కోసం ప్రతి పేపర్‌కూ రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. విద్యార్థులు ష్ట్ర్‌్‌జూ:// ్రbఱవ. షస్త్రస్త్ర. స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో ఆన్లైన్ సేవలను వినియోగించు కోవాలని కోరారు. మార్కుల మెమోలను వచ్చేనెల ఐదో తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్ మెమోలను కాలేజీ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ నుంచి కలర్ ప్రింట్ఔట్ తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ అగ్రస్థానం
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగం ఫలితాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సత్తా చాటింది. రెండింటిలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మేడ్చల్ నుంచి 52,867 మంది పరీక్షలు రాయగా, 40,703 (76 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 28,830 మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 21,014 (72 శాతం) మంది పాసయ్యారు. 24,037 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 19,689 (81 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 74 శాతం ఉత్తీర్ణత సాధించి హన్మకొండ రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 14,897 మంది పరీక్షలు రాయగా, 11,041 (74 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 72 శాతంతో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మూడో స్థానంలో ఉన్నది. ఈ జిల్లా నుంచి 4,426 మంది పరీక్షలు రాస్తే, 3,200 (72 శాతం) మంది పాసయ్యారు. 40 శాతం ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా అట్టడుగున నిలిచింది. ఈ జిల్లా నుంచి 6,621 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,683 (40 శాతం) ఉత్తీర్ణత నమోదైంది.
ఒకేషనల్ విభాగంలో 75 శాతం ఉత్తీర్ణతతో నారాయణపేట జిల్లా అగ్రస్థానంలో, 34 శాతం ఉత్తీర్ణత సాధించి జగిత్యాల జిల్లా చివరిస్థానంలో నిలిచాయి. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగం ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రథమం స్థానంలో ఉన్నది. ఈ జిల్లా నుంచి 48,821 మంది పరీక్షలు రాస్తే, 38,450 (78 శాతం) మంది విద్యార్థులు పాసయ్యారు. 77 శాతంతో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఆ జిల్లా నుంచి 4,060 మంది పరీక్షలు రాస్తే, 3,144 (77 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. మూడో స్థానంలో నిలిచిన హన్మకొండ జిల్లా నుంచి 16,118 మంది పరీక్షలు రాయగా, 12,443 (77 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగం ఫలితాల్లో 47 శాతం ఉత్తీర్ణత సాధించి మెదక్ జిల్లా అట్టడుగున నిలిచింది. ఈ జిల్లా నుంచి 5,906 మంది పరీక్షలు రాస్తే, 2,823 (47 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు.