Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో జూలై 1వ తేదీ నుంచి ఆపరేషన్ ముస్కాన్‌ను నెల రోజుల పాటు నిర్వహించడానికి పోలీసు ఉన్నతాధికారులు సన్నాహాలు పూర్తిచేశారు. దీనికి సంబంధించి మంగళవారం రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డిజి స్వాతి లక్రా స్వియ పర్యవేక్షణలో ఆన్లైన్లో సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. డీజీపీ కార్యాలయం నుంచి జరిగిన ఈ సమావేశానికి 750 మంది వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇందులో 450 మంది వరకు పోలీసు అధికారులుండగా మిగతా వారిలో రాష్ట్ర , కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మొదలుకుని కార్మిక, విద్యా, వైద్య, ఎంసీహెచ్ శాఖలు, వివిధ స్వచ్చంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా అదనపు డిజి స్వాతిలక్రా మాట్లాడుతూ రాష్ట్రంలో వీధి బాలలు, ఇండ్ల నుంచి పరారై వచ్చిన పిల్లలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌కు గురైన బాలలు బౌండెడ్ లేబర్‌గా ఉన్న పిల్లలు, బాల కార్మికులు తదితరులను గుర్తించి వారిని రక్షించి సొంత ఇండ్లకు చేర్చడం, ఇండ్లు లేని వారిని సంరక్షణ గృహాలలో చేర్చడం తదితర చర్యలను ఆపరేషన్ ముస్కాన్ ద్వారా తీసుకుంలున్నామని తెలిపారు. సంఘవిద్రోహ శక్తులు, అరాచక శకర్తుల బారిన ఈ అనాధ పిల్లలు పడితే అది దేశానికి పెను ప్రమాదంగా మారుతుందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి గంగాధర్, డీఐజీ సుమతి , యూనిసెఫ్ ప్రతినిధి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.