Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో డిజిటల్, హోం డెలివరీ సర్వీసులు
- ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలకూ కార్గో సేవలను విస్తరిస్తాం
- టీఎస్ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రెండేండ్ల కాలంలో టీఎస్ఆర్టీసీ కార్గో సేవలను సుమారు 79.02 లక్షల మంది వినియోగదారులు వాడుకున్నారనీ, తమ సంస్థకు రూ.123.45 ఆదాయం సమకూరిందని టీఎస్ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కార్గో సేవలు ప్రారంభమై రెండేండ్లు అవుతున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, కూరగాయలు, ధాన్యం, రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు అవసరమైన సరుకుల రవాణాతో పాటు ఇంకా అనేక రకాల సేవలను ఆర్టీసీ కార్గో ద్వారా అందిస్తున్నదని వివరించారు. ఆర్టీసీ కొరియర్, సర్వీసుల ద్వారా ఇప్పటికే వేగంగా సేవలందిస్తున్నామనీ, ఇంకా ఏమైనా లోపాలుంటే సమీక్షించుకుని ముందుకెళ్తామని తెలిపారు. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు కూడా టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీసులను విస్తరిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 455 టీఎస్ఆర్టీసీ కార్గో పార్సల్ సెంటర్లు పనిచేస్తున్నాయనీ, అవుట్ సైడ్ బ్రాంచెస్ 65 దీనికి అనుబంధంగా ఉన్నాయని తెలిపారు. 177 కార్గో బస్సులు సేవలు అందిస్తున్నాయన్నారు. త్వరలో రాష్ట్రంలో కార్గో డోర్ డెలివరీ సేవలు అందిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ప్రయాణికుల మన్ననలు పొందేందుకు టీఎస్ ఆర్టీసీ పలు రాయితీలకు శ్రీకారం చుట్ట బోతున్నదని ప్రకటించారు. కేవలం పార్శిళ్లు, కొరియర్లపైనే ఆధారపడకుండా ప్రజలకు అవసరమైన సామగ్రిని కూడా అందించడంపై దృష్టి సారించామని చెప్పారు. మేడారం బంగారం (బెల్లం) చేరవేత ద్వారా రూ. 23.30 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. భద్రాద్రి రామయ్య తలంబ్రాల ద్వారా రూ.3,96,480 ఆదాయం ఆర్జించామని తెలిపారు. కార్గోసేవల ద్వారా బంగినపల్లి మామిడి పండ్లను సైతం సరఫరా చేశామన్నారు. వినియోగదారుల కోరిక మేరకు జంటనగరాలు, జిల్లా కేంద్రాల్లో నూతన కార్గో సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అతి త్వరలోనే వినియోగదారుల కోసం ఆన్లైన్ పేమెంట్ చేసే వెసులుబాటు సైతం కల్పిస్తామని హామీనిచ్చారు. ఆర్టీసీ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.