Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
నవతెలంగాణ-బీబీనగర్
దేశంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించడంలో అన్ని ఎయిమ్స్ వైద్యశాలలు ముందున్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని ఆమె సందర్శించారు. స్కిల్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఎయిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో రూపొందించిన 233 పేజీల రిలీజింగ్ ఇనిస్టిట్యూట్ రీసెర్చ్ మ్యాగ్జిన్, 'ఆపరేషన్ స్వస్త్ ది సర్జికల్ జర్నీ అనుసంధాన్' పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. వైద్యులు సర్జరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కోవిడ్ సమయంలో బీబీనగర్ ఎయిమ్స్ వైద్యులు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రాముఖ్యత ఇచ్చి అందరి సహకారంతో విజయవంతం చేశారని తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ.. ఎయిమ్స్ అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించడంలో ముందుందని, అవసరమున్న అన్ని రకాల ఎక్విప్మెంట్స్ తెప్పిస్తున్నట్టు తెలిపారు. ఎయిమ్స్‌కు గవర్నర్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించాలని కోరారు. అనంతరం ఎయిమ్స్ ప్రాంగణంలో గవర్నర్ మొక్కలు నాటారు. ఆస్పత్రి గదులను సందర్శించారు. అంతకు ముందు గవర్నర్‌కు డైరెక్టర్, కలెక్టర్ పమేలా సత్పతి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రాహుల్ నారంగ్, డీన్ నీరజ్ అగర్వాల్, మెడికల్ సూపరింటెండెంట్ అనంత్‌రావు, వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.